
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డా బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బీఆర్‌ఏజీ సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితోపాటు గురుకులాల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఖాళీలలో ప్రవేశాలకు కూడా అర్హులైన బాలురు, బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బాలబాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 20, 2026వ తేదీ నుంచి మొదలవుతాయి. ఫిబ్రవరి 19, 2026 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిరుపేద గ్రామీణ విద్యార్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://apgpcet.apcfss.in గురుకులాల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఈ గురుకులాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల పిల్లలకు ఉచిత విద్యతోపాటు, నివాస, భోజనం, పుస్తకాలు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1983లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 190 సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థలు ఉన్నాయి. వీటిలో 67 బాలుర గురుకాలు, 123 బాలికల గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తున్నాయి. కాగా 2022లో అన్ని APSWRS, జూనియర్ కళాశాలలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలుగా పేరు మార్చిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.