AP LEAP School: ఏపీలో సరికొత్త లీప్ స్కూల్.. దీని స్పెషాలిటీ ఏంటో చూడండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో సరికొత్త విప్లవం.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీలో తొలి లీప్ పాఠశాల సిద్ధమైంది. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో రూ.16 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక పాఠశాలను నిర్మించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు అందుబాటులోకి రానున్న ఈ స్కూల్ విశేషాలు చూడండి..

AP LEAP School: ఏపీలో సరికొత్త లీప్ స్కూల్.. దీని స్పెషాలిటీ ఏంటో చూడండి..
Ap Leap School

Edited By:

Updated on: May 28, 2026 | 7:16 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తూ.. అంతర్జాతీయ స్థాయి వసతులతో సరికొత్త విద్యావిధానానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. LEAP.. అంటే Learning Excellence in Andhra Pradesh పేరుతో రాష్ట్రంలోనే మొట్టమొదటి పాఠశాలను మంత్రి నారా లోకేష్ ప్రతినిథ్యంవహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 1983లో కేవలం 12 గదులతో ప్రారంభమైన ఈ పాఠశాల.. నేడు మంత్రి లోకేశ్ ప్రత్యేక చొరవతో కార్పొరేట్ క్యాంపస్‌ను తలపిస్తోంది.

రూ.16 కోట్ల భారీ వ్యయంతో ఈ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. గతంలో 12 గదులు ఉన్న ఈ స్కూల్‌ను ఇప్పుడు 25 గదులకు పెంచారు. సైన్స్ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా ఆరు అధునాతన ల్యాబ్‌లను కేటాయించారు. ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్, కంప్యూటర్స్, ఒకేషనల్ ల్యాబ్‌లతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రత్యేకంగా ‘స్పెషల్ ఇన్నోవేషన్ హబ్’ను కూడా ఏర్పాటు చేయడం విశేషం.

చదువుతో పాటు విద్యార్థుల శారీరక వికాసానికి ఇక్కడ పెద్దపీట వేశారు. 5.2 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం, అధునాతన ఆట స్థలం, ఫుట్‌బాల్ గ్రౌండ్‌లను సిద్ధం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సరికొత్త ‘యాంపీ థియేటర్’ను నిర్మించారు. అలాగే, విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేసేందుకు వీలుగా ఒకేసారి 400 మంది కూర్చునే భారీ డైనింగ్ హాల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

ఇక్కడ కల్పిస్తున్న కార్పొరేట్ స్థాయి వసతులను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో సీట్లు నిండిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వెనుదిరిగి వెళుతున్నారు. ఈ సంవత్సరం దొరకకపోతే వచ్చే సంవత్సరం ఆయన మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాల ఆధునీకరణకు ముందు ఇక్కడ విద్యార్థుల సంఖ్య 510 మంది ఉండగా.. వసతులు పెరగడంతో ఈ విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య ఏకంగా 1,100కు చేరింది. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే ఇక్కడ నాణ్యమైన విద్యాబోధన అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ అంతర్జాతీయ ప్రమాణాల పాఠశాల విద్యార్థులకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది.

Follow Us