
అమరావతి, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను ఆదివారం (ఏప్రిల్ 20) విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తిస్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా ఆదివారం ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమైనాయి. అయితే దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దరఖాస్తు ఏ, బీ విభాగాలుగా విభజించి.. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాల నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్‌జేసీ, సంక్షేమశాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బీలో సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం ఉంటుంది. పదో తరగతి నుంచి బీఈడీ వరకు ఉన్న అన్ని సర్టిఫికెట్లను ఇందులో అప్‌లోడ్ చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాలు తగ్గించి వేగంగా నియామకాలు చేపట్టాలని ఈ విధానం తీసుకొచ్చారు. గతంలో ఈ విధానం మెరిట్ జాబితా విడుదలైన తర్వాత చేపట్టేవారు. కానీ ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్‌లు ఇస్తారు. సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయకుంటే హాల్‌టికెట్లు జారీ చేయరు. అలాగే దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకూ అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే అన్నీ సరిచూసుకుని, దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి మే 15వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డీఎస్సీ-2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈసారి దరఖాస్తు సమర్పించొచ్చు. అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టుకు కాకుండా ఇతర పోస్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 1, 2025వ తేదీ నాటికి 44 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.