AP Inter Supply Results 2026: లక్షలాది మంది ఎదురుచూపులకు తెర.. 2 రోజుల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికావడంతో జూన్ 18న ఫలితాలు ప్రకటించే దిశగా ఇంటర్మీడియట్ విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇంటర్ ఫలితాల అనంతరం ఈఏపీసెట్ రిజల్ట్స్ కూడా విడుదల కానున్నాయి..

AP Inter Supply Results 2026: లక్షలాది మంది ఎదురుచూపులకు తెర.. 2 రోజుల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
AP Inter Supplementary Results

Updated on: Jun 16, 2026 | 11:45 AM

అమరావతి, జూన్ 16: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అందిన సమాచారం మేరకు జూన్ 18న ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 12.50 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయగా, ఈ ప్రక్రియ జూన్ 15తో ముగిసింది. ప్రస్తుతం ఫలితాల ప్రాసెసింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకు రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో జూన్ 18న ఫలితాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పూర్తయిన ప్రాక్టికల్ పరీక్షలు

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 5 వరకు నిర్వహించారు. అనంతరం ప్రాక్టికల్ పరీక్షలను జిల్లా కేంద్రాల్లో జూన్ 7 నుంచి 11 వరకు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షల మూల్యాంకనం కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే నిర్ణయించిన తేదీకి ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు భారీ స్పందన

ఈ ఏడాది తొలిసారిగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మార్కులు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరీక్షలు రాయడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇంటర్ ఫలితాల తర్వాత ఈఏపీసెట్ రిజల్ట్స్

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల తర్వాత వెంటనే ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈఏపీసెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాతే ఈఏపీసెట్ ఫలితాలను ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులతో పాటు ఈఏపీసెట్ అభ్యర్థులు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ మార్కులు, ఫలితాలను పరిశీలించుకోవచ్చు.

Follow Us