AP &TG Inter 2026 Result Dates: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీలు ఇవే.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే?

అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్‌ రిజల్ట్స్‌ను ఏప్రిల్ రెండో వారంలోపు విడుదల చేసేందుకు..

AP &TG Inter 2026 Result Dates: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీలు ఇవే.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే?
AP and Telangana Inter Result Dates

Updated on: Mar 31, 2026 | 6:15 AM

హైదరాబాద్‌, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ 2026 పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్‌ రిజల్ట్స్‌ను ఏప్రిల్ రెండో వారంలోపు విడుదల చేసేందుకు ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైంది. వీలైతే ఏప్రిల్ 6వ తేదీనే ఇంటర్‌ ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే ఏప్రిల్ 10 లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

దీంతో ఈసారి స్పాట్‌ కేంద్రాల సమయం రెండు గంటలు పెంచారు. గత ఏడాది వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం సాగేది. కానీ ఈసారి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలని డీఐఈవోలు ఆదేశించారు. అంతేకాకుండా ఫలితాలు త్వరగా వెల్లడించాలని భావిస్తున్న ఇంటర్‌ బోర్డు రోజుకు 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని అధ్యాపకులకు హుకూం జారీ చేశారు. గతంలో రోజుకు 30 పేపర్లు ఇచ్చేవారు. కాగా గత ఏడాది ఇంటర్‌ ఫలితాలను ఏప్రిల్‌ 22న, సప్లిమెంటరీ ఫలితాలను జూన్‌ 16న విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మార్చి 21 నుంచి మూల్యాంకనం మొదలైంది. ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్‌ 14లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఏప్రిల్‌ 21లోగా ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మూల్యాంకనం కేంద్రాల్లో ఒక్కో లెక్చరర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబు పత్రాలను మూల్యాంకనానికి ఇస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి తిరిగి జూనియర్ కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మే 31 నాటికే సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా పూర్తి చేయాలని ఈ రెండు రాష్ట్రాల బోర్డులు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us