అమరావతి, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షల (పీఎంటీ, పీఈటీ) కోసం ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్ 2 దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన గడువును పొడిగిస్తూ పోలీసు నియామక మండలి ప్రకటన జారీ చేసింది. నవంబరు 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తన ప్రకటనలో తెలిపింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆఖరు తేదీ నవంబరు 20తో ముగిసింది. అ క్రమంలో గడువును పొడిగిస్తూ తాజాగా బోర్డు ప్రకటన విడుదల చేసింది. దేహదారుఢ్య పరీక్షకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇతర వివరాలకు 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
సీబీఎస్‌ఈ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12 తరగతుల వార్షిక పరీక్షలు 2025 ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలియజేస్తూ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయని సీబీఎస్‌ఈ తన ప్రకటనలో వెల్లడించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్ 1 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తుంది. నవంబర్ 22వ తేదీ ముగింపు సమయం నాటికి ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు అప్లికేషన్‌లో సవరణకు అవకాశం కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు నవంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని పేర్కొంది. నవంబర్ 27న రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అయితే సవరణ చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఒక్కసారి మాత్రమే సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్లికేషన్‌లో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, చిరునామా, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డిటైల్స్, అభ్యర్థి ఫొటోలో తప్ప మిగిలిన విషయాల్లో మాత్రమే మార్పులకు అవకాశం కల్పిస్తారు.