ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 3,432 ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్ కమలాకరరెడ్డి బుధవారం (నవంబరు 23) పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3/జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు/ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులన్నింటికీ కలిపి ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను డిసెంబరు 21న మూడు విడతల చొప్పున, డిసెంబరు 22న మూడు విడతల చొప్పున, డిసెంబరు 23న ఒక విడత చొప్పున, డిసెంబరు 29న రెండు విడతలు చొప్పున, వచ్చే ఏడాది జనవరి 2న మూడు విడతల చొప్పున నిర్వహిస్తారు.
ఇక కాపీయిస్టు/ఎగ్జామినర్/రికార్డు అసిస్టెంట్ పోస్టులకు డిసెంబరు 26న రెండు విడతల్లో ఉమ్మడి పరీక్ష ఉంటుంది. డ్రైవర్/ప్రాసెస్ సర్వర్/ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు డిసెంబరు 26వ తేదీన ఒక విడత, డిసెంబర్ 27వ తేదీన మూడు విడతలు, డిసెంబర్ 28వ తేదీన మూడు విడతలు, డిసెంబర్ 29వ తేదీన ఒకవిడత చొప్పున ఉమ్మడిగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు నిర్వహించే నియామక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల అధికారిక వెబ్‌సైట్‌లలో డిసెంబరు 16 నుంచి అందుబాటులో ఉంచుతారు. కాగా రాష్ట్ర హైకోర్టు పరిధిలో పైన పేర్కొన్న అన్ని పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు ప్రకటించిన్పటికీ నియామక పరీక్షలను మాత్రం ఉమ్మడిగా ఆయా తేదీల్లో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఎస్ కమలాకరరెడ్డి తెలిపారు. తాజా అప్‌డేట్ల కోసం అభ్యర్ధులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్లను చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.