AP DSC 2024 Free Coaching: మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్‌ దరఖాస్తు గడువు పొడిగించిన విద్యాశాఖ.. ఎప్పటివరకంటే

|

Oct 23, 2024 | 2:04 PM

ఏపీలో మరో 10 రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవనుంది. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ నిరుపేద అభ్యర్ధులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు ప్రకటన వెలువరించింది. ఆసక్తి కలిగిన వారు జన్మభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా తుది ఎంపిక చేస్తారు. మరో రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగుస్తుంది..

AP DSC 2024 Free Coaching: మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్‌ దరఖాస్తు గడువు పొడిగించిన విద్యాశాఖ.. ఎప్పటివరకంటే
AP DSC 2024 Free Coaching
Follow us on

అమరావతి, అక్టోబర్‌ 23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన క్రమంలో దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు అక్టోబర్‌ 21వ తేదీతో తుది గడువు ముగిసింది. తాజాగా దానిని అక్టోబర్ 25వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏపీలో మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకుని, ఉద్యోగ కలను సాకారం చేసుకోవాలని సూచించారు.

కాగా డీఎస్సీ 2024 ఉచిత శిక్షణ‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధ‌న‌, ఉచిత భోజనం, వ‌స‌తి సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించనుంది. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఆయా జిల్లాల్లో 3 నెల‌ల పాటు తరగతులు నిర్వహించి, పరీక్షకు సిద్ధం చేస్తారు. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పేపర్‌ 1, 2 ప‌రీక్షల‌కు సంబంధించి కోచింగ్ ఉంటుంది. అయితే ఈ ఉచిత కోచింగ్‌ కార్యక్రమం కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. అర్హత కలిగిన వారు జ్ఞానభూమి అధికారిక వెబ్‌పోర్టల్ ద్వారా అక్టోబ‌ర్ 25, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ 2024-25 ద్వారా మొత్తం 5,050 మంది అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. వీటిల్లో ఎస్సీలకు 3,050 సీట్లు, ఎస్టీలకు 2,000 సీట్లు కేటాయిస్తారు. ఎస్‌జీటీ కోచింగ్‌కు ఇంటర్, డీఈడీ, టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ కోచింగ్‌కు డిగ్రీ, బీఈడీ, టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకుండా ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 85 మార్కులకు, మిగిలిన 15 మార్కులకు టెట్ స్కోరు ఆధారంగా వెయిటేజీ ఇస్తారు. ఎస్జీటీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.26,500 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.28,500 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏపీ డీఎస్సీ 2024 ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుకు జ్ఞానభూమి వెబ్‌సైట్‌ లింక్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.