
అమరావతి, డిసెంబర్ 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పబ్లిక్ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా ప్రారంభమైనాయి. ఈసారి విద్యార్థులే నేరుగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తామే ఫీజు చెల్లిస్తే ఆ విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా తెలియజేయాలని ఈ సందర్భంగా సూచించారు. పాఠశాలలు అధిక ఫీజు డిమాండు చేస్తే విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పరీక్ష ఫీజు రూ.125 కంటే అదనంగా నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఈ క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ఇక నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఫీజు వసూలుచేసే ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత బడులకు జరిమానా విధిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి వార్నింగ్ ఇచ్చారు. స్కూల్ యాజమన్యం అనధికార వసూళ్లకు పాల్పడితే విద్యార్థులు, తల్లిదండ్రులు మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. కాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.