కేవలం రూ.600కే నీటితో నడిచే పొయ్యి.. 16 ఏళ్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ

సైన్స్‌పై ఆసక్తి ఉంటే వయసుతో సంబంధం లేదని నిరూపించాడు మధ్యప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి వ్యాస్‌జీ మిశ్రా. 11వ తరగతి చదువుతున్న సమయంలోనే తక్కువ ఖర్చుతో పనిచేసే ఓ వినూత్న పొయ్యిని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కిరోసిన్‌తో పాటు నీటిని ఉపయోగించే ఈ హైబ్రిడ్‌ స్టవ్‌ కిరోసిన్ వినియోగాన్ని, పొగను తగ్గించేలా రూపొందించాడు. ఈ ఆవిష్కరణకు రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రథమ బహుమతి కూడా లభించింది..

కేవలం రూ.600కే నీటితో నడిచే పొయ్యి.. 16 ఏళ్ల విద్యార్థి అద్భుత ఆవిష్కరణ
Hybrid Stove

Updated on: Sep 15, 2026 | 7:15 AM

మధ్యప్రదేశ్‌లోని దేవ్‌సర్‌కు చెందిన వ్యాస్‌జీ మిశ్రాకు చిన్నప్పటి నుంచే సైన్స్‌, దాని ప్రాక్టికల్‌ ఉపయోగాలపై ఆసక్తి ఉండేది. పలు సైన్స్‌ పోటీల్లో పాల్గొన్న అతను గతంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన మోడల్‌ను కూడా రూపొందించాడు. ఆ ప్రాజెక్టుకు సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రథమ బహుమతి సాధించాడు. మిశ్రా రూపొందించిన పరికరం సాధారణ కిరోసిన్‌ పొయ్యికి భిన్నంగా ఉంటుంది. రెండు సంప్రదాయ కిరోసిన్‌ స్టవ్‌లను కలిపి, అందులో మూడు రెగ్యులేటర్లను అమర్చాడు. ఒక రెగ్యులేటర్‌ కిరోసిన్‌ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. మరోటి నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. మూడో రెగ్యులేటర్‌ బర్నర్‌ను ఆన్‌, ఆఫ్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పొయ్యిలో కిరోసిన్‌కు ఒక ట్యాంక్‌, నీటికి మరో ట్యాంక్‌ ఉంటాయి. రెండు ట్యాంకులు ఒకే బర్నర్‌కు అనుసంధానమై ఉంటాయి. నీటి నుంచి ఏర్పడే ఆవిరి దహన ప్రక్రియకు సహాయపడేలా ఈ వ్యవస్థను రూపొందించారు.

కిరోసిన్ వినియోగంలో 20 శాతం వరకు ఆదా

సంప్రదాయ పొయ్యిలతో పోలిస్తే కిరోసిన్‌ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పొగను కూడా తగ్గించాలనే లక్ష్యంతో మిశ్రా ఈ నమూనాను తన అన్నయ్య సహాయంతో తయారు చేశాడు. అనంతరం ఐఐటీ గువాహటి నిపుణులు ఈ డిజైన్‌ను పరీక్షించి మరింత మెరుగుపరిచారు. వారి అంచనాల ప్రకారం ఈ స్టవ్‌ సుమారు 20 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదు. అంతేకాదు మొదటి ప్రోటోటైప్‌ను తయారు చేసేందుకు కేవలం రూ.600 వరకు ఖర్చయింది. దీంతో కిరోసిన్‌పై ఆధారపడే తక్కువ ఆదాయ కుటుంబాలకు కూడా ఇది అందుబాటులో ఉండే పరిష్కారంగా నిలిచింది.

మిశ్రా రూపొందించిన హైబ్రిడ్‌ స్టవ్‌ స్థానిక సైన్స్‌ ఎగ్జిబిషన్లలో, వార్తాపత్రికల్లో ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం 2003లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ఈ ఆవిష్కరణకు ప్రథమ బహుమతి లభించింది. అప్పటి విద్యాశాఖ మంత్రి ఇంద్రజిత్‌ కుమార్‌ పటేల్‌ చేతుల మీదుగా మిశ్రా అవార్డు అందుకున్నాడు. ఈ గుర్తింపు తర్వాత నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (NIF), గ్రాస్‌రూట్స్‌ ఇన్నోవేషన్స్‌ ఆగ్మెంటేషన్‌ నెట్‌వర్క్‌ (GIANs)తో కలిసి ఈ ఆవిష్కరణకు మరింత ప్రోత్సాహం అందించింది. నీరు-కిరోసిన్‌ స్టవ్‌తో పాటు మరో మూడు ఆవిష్కరణల ప్రోటోటైప్‌ అభివృద్ధి, మార్కెట్‌ పరిశోధన కోసం మైక్రో వెంచర్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ నుంచి రూ.37,250 మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి

కిరోసిన్‌ ధరలు పెరగడం, ఇంట్లో కిరోసిన్‌ పొగ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వంటి అంశాల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఇంధన వినియోగాన్ని తగ్గించే ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో కిరోసిన్‌పై ఆధారపడే కుటుంబాలకు ఈ తరహా సాంకేతిక పరిష్కారాలు ఖర్చును తగ్గించడంతో పాటు పొగను నియంత్రించడంలో సహాయపడగలవు. చిన్న వయసులోనే సమస్యను గుర్తించి, దానికి తక్కువ ఖర్చుతో పరిష్కారం చూపిన వ్యాస్‌జీ మిశ్రా ఆవిష్కరణ యువతలో సైన్స్‌పై ఆసక్తికి మంచి ఉదాహరణగా నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us