Zomato Online Food: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి ఉచితంగా కరోనా టీకాలు వేయించేందుకు ముందుకు వచ్చింది. 150,000 మంది ఫ్రంట్ లైన్ సిబ్బందికి ఉచితం టీకా డ్రైవ్ నిర్వహించనున్నట్లు కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. గత వారం ఎన్‌సీఆర్‌లో డెలివరీ సిబ్బందికి టీకాలు వేయడం ప్రారంభించామని, ఇప్పుడు ఫ్రంట్‌లైన్ సిబ్బంది, ఉద్యోగులకు టీకా వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే వేలాది మందికి వ్యాక్సిన్ అందించామని ఆయన ట్వీట్ చేశారు. ముంబై, బెంగళూరులో శనివారం నుంచి టీకాలు ప్రారంభమైనట్లు చెప్పారు. మిగతా నగరాల్లో వచ్చేవారం నుంచి టీకాలు వేయడం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజు లక్షలాది ఆర్డర్లను కస్టమర్లకు చేరవేరుస్తున్న సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని సొంత ఖర్చులతో ఈ టీకా డ్రైవ్ చేపట్టినట్లు గోయాల్ తెలిపారు. మరి కొన్ని రోజుల్లో ఇతర నగరాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి డెలివరి సిబ్బంది, ఉద్యోగులకు టీకాలు వేయనున్నామని పేర్కొన్నారు.