Yamaha EV Bike: జపాన్ ద్విచక్ర వాహన సంస్థ యమహా భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలపైపు వెళ్తోంది. ముఖ్యంగా భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్ ఫాంపై ప్రత్యేక దృష్టి సారించింది. భారత్‌లో ఈ-మొబలిటిలో కంపెనీ పెట్టుబడులు ప్రభుత్వ స్పష్టమైన రోడ్ మ్యాప్ పై ఆధారపడి ఉంటాయని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వం తన FAME 2 ఫథకంతో ఎలక్ట్రిక్ వెహికల్పోత్సహకాలను పెంచిందని, అయితే మౌలిక సదుపాయాల కల్పన, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి వంటి ముఖ్యమైన అంశాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని యమహా సంస్థ అభిప్రాయపడింది. వీటిని పరిష్కారించాల్సిన అవసరముందనని తెలిపింది. అందువల్ల జపాన్ నిపుణుల బృందం భారత్ తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్ ఫాంను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిందని యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఛైర్మన్ మోటోఫుమి షిటారా తెలిపారు.
మేము ఇప్పటికే మా జపాన్ కార్యాలయంలో ఓ ప్రత్యేక బృందాన్ని కలిగి ఉన్నాం. భారత్ తో పాటు ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్త ఈవీల వేదికపై పనిచేస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా తైవాన్ లో విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీ మోడళ్లను అభివృద్ధి చేయడానికి తగిన సాంకేతికత, నైపుణ్యం ఇప్పటికే అమలులో ఉన్నాయని అన్నారు.
ఇక భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ను నిర్దేశిస్తే తప్ప దీన్ని పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల లభ్యత, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి లాంటి ఇతర సదుపాయాల కల్పన లాంటి సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం ఆ అంశాలను పరిష్కరించిన తర్వాత తాము భారత్ లో ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా తయారు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, యమాహా ఇటీవలే ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది.