
ఎప్పటికప్పుడు దేశంలోని ప్రతి వర్గానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఈ పథకాల లక్ష్యం దేశంలోని ప్రతి వర్గాల ప్రజలకు సహాయం చేయడమే. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అటువంటి పరిస్థితిలో ప్రజలకు సహాయం చేయడానికి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ముద్ర యోజన’ పథకాన్ని తీసుకువచ్చింది. దీని కింద ప్రజలకు రుణాలు అందజేస్తుంది. ఈ పథకం కింద, మీరు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు వ్యాపార రుణం తీసుకోవచ్చు. ఈ పథకం యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’ కింద రూ.10 లక్షల వరకు గ్యారెంటీ లేని రుణం కావాలంటే రుసుముగా రూ.2,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఈ వైరల్ అవుతున్న లేఖ సారాంశం. ప్రభుత్వం ఈ రుసుమును లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఫీజుగా తీసుకుంటోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ వైరల్ క్లెయిమ్‌ను తనిఖీ చేసింది. ఈ దావా పూర్తిగా తప్పు అని గుర్తించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణం తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి రుసుమును వసూలు చేయదని, ఈ వార్త పూర్తిగా నకిలీదని ఫాక్ట్ చెక్ వివరించింది.
ఈ క్లెయిమ్ పూర్తిగా ఫేక్ అని పీఐబీ ఫాక్ట్ చెక్ తెలిపింది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. పీఎం ముద్రా లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఫీజు అని ఎటువంటి రుసుమును వసూలు చేయదని గుర్తుంచుకోండి. వైరల్ అవుతున్న QR కోడ్‌లో డబ్బు పంపితే మీరు మోసానికి గురవుతారు. అటువంటి మోసాల పట్ల పూర్తిగా జాగ్రత్తగా ఉండండి. దీనితో పాటు రుణం పొందడానికి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.
ప్రజలు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ప్రభుత్వం ఈ రుణాన్ని మొత్తం మూడు కేటగిరీల్లో ఇస్తుంది. మొదటి శిశు రుణం రూ.50,000 వరకు రుణం. అదే సమయంలో కిషోర్ రుణం రూ.50,000 నుండి రూ.5 లక్షల వరకు లభిస్తుంది. మరోవైపు తరుణ్ లోన్ లో ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి