
బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందంటూ చాలమంది చెప్పడం మనం వింటూ ఉంటా. దీని వల్ల బ్యాంక్ అకౌంట్ పని చేయడం లేదని చెబుతుంటారు. అయితే ఎందుకు ఫ్రీజ్ అయిందో తెలియక సతమతమవుతుంటారు. అసలు బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అవుతుంది..? ఇలాంటి సమయంలో ఏం చేయాలి? తిరిగి అకౌంట్ రీయాక్టివ్ ఎలా చేయించుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా 3 కారణాల వల్ల ఎక్కువగా అకౌంట్ స్తంభించిపోతూ ఉంటుంది. కేవైసీ పెండింగ్‌లో ఉండటం వల్ల అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశముంటుంది. అలాగే మీ అకౌంట్ నుంచి అనుమానాస్పద ట్రాన్సక్షన్లు, చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడితే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అలాగే ఏదైనా కేసుల్లో కోర్డు ఆదేశాల మేరకు అకౌంట్ ఫ్రీజ్ చేసి ఉండవచ్చు. ఈ మూడు కారణాల వల్ల ఎక్కువగా అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
అకౌంట్ ఫ్రీజ్ అయితే మీకు బ్యాంక్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఫ్రీజ్ అయిందని మీకు తెలిసి ఉండకపోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి వెళితే మీ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి గల కారణాలను తెలుసుకోవచ్చు. అప్పటికీ మీకు క్లారిటీ రాకపోతే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం లేదా దగ్గరల్లోని బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. దీంతో బ్యాంక్ సిబ్బంది ఫ్రీజ్ అవ్వడానికి గల కారణాలను వెల్లడిస్తారు. ఏదైనా సంకేతిక సమస్య వల్ల జరిగి ఉంటే సిబ్బంది వెంటనే యాక్టివ్ చేస్తారు. ఒకవేళ మీ తప్పు వల్ల జరిగి ఉంటే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి. ఆధారాలు సమర్పిస్తే సిబ్బంది పరిశీలించి యాక్టివేట్ చేస్తారు
కేవైసీ అప్డేట్ చేసుకోవడం, ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం, ఆధార్ వెరిఫికేషన్ క్లియర్ చేయడంతో పాటు ఆధార్, ఫోన్ నెంబర్లను అప్డేట్ చేసుకోవడం, వీడియో లేదా సెల్పీ వెరిఫికేషన్ పూర్తి చేయడం వంటివి చేస్తే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఇక భారీ మొత్తంలో ఒకేసారి నగదు జమ కావడం, పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సఫర్లు జరిగితే.. వాటికి గల కారణాలు, ఆధారాలను బ్యాంకులకు సమర్పించాలి. దీంతో అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈడీ ఆర్డర్లు, ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసుల వల్ల అకౌంట్ బ్లాక్ అయితే అధికారుల నుంచి అనుమతి వచ్చాకే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.