UPI transactions: నగదు చెల్లింపులకు ఈ రెండింటిలో ఏది బెస్ట్‌..? యూపీఐ, యూపీఐ లైట్‌ మధ్య తేడాలివే

|

Dec 15, 2024 | 7:30 AM

దేశంలో ఆన్ లైన్ నగదు చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. చిల్లర వ్యాపారం నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ ఎక్కడ చూసినా ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ డిజిటల్ చెల్లింపులు క్రమంగా పెరిగాయి.

UPI transactions: నగదు చెల్లింపులకు ఈ రెండింటిలో ఏది బెస్ట్‌..? యూపీఐ, యూపీఐ లైట్‌ మధ్య తేడాలివే
Upi Payments
Follow us on

స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి యూపీఐ యాప్ ద్వారా చాలా సులభంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. యూపీఐ గురించి అందరికీ తెలిసిందే. కానీ యూపీఐ లైట్ ద్వారా కూాడా ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు. వీటి మధ్య తేడా, ప్రయోజనాలు తదితర వాటిని తెలుసుకుందాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ది చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఈ సంస్థ పనిచేస్తుంది. యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి, పిన్ ఎంటర్ చేసి లావాదేవీలు జరపవచ్చు. దీనికి అనుబంధంగా ప్రజల సౌకర్యం కోసం యూపీఐ లైట్ ను 2022లో తీసుకువచ్చారు. తక్కువ మొత్తంలో చెల్లింపులను పిన్ ఎంటర్ చేయకుండానే చెల్లించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఉపయోగపడేలా రూపొందించారు.

యూపీఐ విధానంలో రోజుకు రూ.లక్ష వరకూ లావాదేవీలు జరపవచ్చు. విద్యకు సంబంధించిన ఫీజులు, ఆస్పత్రి బిల్లులు, పన్ను చెల్లింపులు, పెట్టుబడులను ఈ పరిమితి నుంచి మినహాయించారు. వీటికి రోజుకు రూ.5 లక్షల వరకూ ఉంటుంది. మన దేశంతో పాటు సింగపూర్‌, యూకే, మారిషస్‌, మలేషియా, యూఏఈ, ఫాన్స్‌, నేపాల్‌, శ్రీలంక లో కూడా యూపీఐ పనిచేస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌, మంచి ఇంటర్నెట్‌ సౌకర్యం, యాక్టివ్‌ బ్యాంకు ఖాతా ఉన్నవారు దీని ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు పంపించవచ్చు. యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌, యూపీఐకు లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌, వర్చువల్‌ ఐడీల ద్వారా ఆర్థిక లావాదేవీలు చాలా సులభంగా చేయవచ్చు.

యూపీఐ లైట్‌ ద్వారా పరిమిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఎటువంటి పిన్‌ నంబర్‌ లేకుండానే రూ.వెయ్యిలోపు లావాదేవీలు నిర్వహించవచ్చు. దీని వినియోగదారులు తమ వాలెట్‌లో రూ.5 వేల వరకూ బ్యాలెన్స్‌ నిర్వహించవచ్చు. కిరాణా, యుటిలిటీ బిల్లులు తదితర చిన్న మొత్తాల చెల్లింపులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్‌ టాప్‌ అప్‌ ఫీచర్‌ ద్వారా వాలెట్‌ లోకి నిర్ణీత బ్యాలెన్స్‌ వచ్చి చేరుతుంది.

ఇవి కూడా చదవండి
  • యూపీఐ ద్వారా అధిక విలువైన లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంటుంది. యూపీఐ లైట్‌ ద్వారా పరిమిత లావాదేవీలు మాత్రమే నిర్వహించవచ్చు.
  • యూపీఐ ట్రాన్సాక‌్షన్‌కు పిన్‌ చాలా అవసరం, కానీ యూపీఐ లైట్‌ ను అది లేకుండానే ఉపయోగించవచ్చు.
  • యూపీఐ కన్న యూపీఐ లైట్‌ ద్వారా చెల్లింపులు వేగవంతంగా చేయవచ్చు. పిన్‌ అవసరం లేదు కాబట్టి తొందరగా లావాదేవీలు పూర్తవుతాయి.
  • ఇంటర్నెట్‌ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా యూపీఐ లైట్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది.
  • యూపీఐ ద్వారా ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిగితే యూపీఐ లైట్‌ ద్వారా తక్కువ మొత్తంలోనే జరుగుతాయి.
  • ఈ రెండు విధానాలు అత్యంత సురక్షితమైనవి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..