
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మోనిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాన్ని గత వారంలో నిర్వహించింది. ఈ సమావేశంలో రెపో రేటును పెంచలేదు, తగ్గించలేదు. గతంలో ఉన్న రేటు 6.5 శాతాన్నే కొనసాగించింది. ఆర్బీఐ ఇలా చేయడం రెండోసారి. గత రెండు ఎంపీసీ సమావేశాల్లోనూ రెపో రేటును ఏమాత్రం కదల్చలేదు. వాస్తవానికి బ్యాంకులు అందించే రుణాలు ఈ రెపో రేటు ఆధారంగా మారుతుంటాయి. రెపో రేటు పెరిగితే బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. అది తగ్గితే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. ఎందుకంటే పలు కమర్షియల్ బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుంచి నగదును అప్పు తెచ్చుకొని.. వినియోగదారులకు రుణాలు ఇస్తుంటాయి. అయితే రెపో రేటు పెరిగితే ఈ వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రస్తుతానికి రెపో రేటులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి వడ్డీ రేట్లు అలాగే రుణాల ఈఎంఐలు పెరిగే అవకాశం లేదు. ఇది ఒకరకంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈ వడ్డీ రేట్లు, ఈఎంఐల భారం ఎప్పుడు తగ్గుతుంది? అసలు తగ్గే అవకాశం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం రండి..
వడ్డీ రేట్లు తగ్గాలన్నా.. ఈఎంఐల భారం పెరగకుండా ఉండాలన్నా దేశంలో ద్రవ్యోల్బణమే ప్రధాన అంశంగా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గిన తర్వాత రెపో రేట్లు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక సంవత్సరంలోపే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, రుణదాతలను రుణాలు తీసుకోకుండా నిరోధించడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. అదే విధంగా భవిష్యత్తులో రెపో రేటు మార్పుకు సంబంధించి ఆర్బీఐ వ్యూహం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది ఎల్‌నినో ప్రభావం. అంటే రాబోయే నెలల్లో రుతుపవనాల స్థితి. దీని ఫలితం ఖరీఫ్ ఉత్పత్తి స్థాయిని నిర్ణయిస్తుంది, ఇది ఆహార ద్రవ్యోల్బణం, గ్రామీణ డిమాండ్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. రాబోయే కొద్ది నెలల్లో ధరల మొత్తం కదలిక, జీడీపీ GDP ట్రెండ్‌లు రెపో రేటుపై ఆర్బీఐ చర్యను నిర్ణయిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రెపో రేటును 4 శాతానికి తగ్గించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ట్రెండ్‌లను పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో లేదా నాల్గో త్రైమాసికంలో రెపో రేటు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల రెండోసారి వడ్డీరేట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవడం వడ్డీ రేట్లు స్థిరీకరించే అవకాశం ఉందనడానికి సానుకూల సంకేతం అని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటే, ఈ ఏడాది చివరినాటికి వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా, మీరు మీ లోన్‌పై ఎక్కువ రేటును చెల్లిస్తున్నట్లయితే, ఈఎంఐలలో ఆదా చేయడానికి తక్కువ రేటుకు దాన్ని రీఫైనాన్స్ చేయండి. అలాగే, మీ లోన్‌కి వర్తించే స్ప్రెడ్ రేట్‌ని చెక్ చేయండి. రుణదాతలు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, ఆదాయ వనరు, రుణ పరిమాణం ఆధారంగా స్ప్రెడ్ రేటును నిర్ణయిస్తారు. ఈ రేటు మీ లోన్ కాలవ్యవధిలో స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం, అత్యల్ప స్ప్రెడ్ రేటు 1.9 శాతంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..