
ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ జీవనశైలి అంటేనే ఒక విలాసం. వారి ఇల్లు యాంటిలియా, వారు వాడే కార్లు, ధరించే దుస్తులు ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే వీటన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వారు తాగే నీరు.. అవును.. అంబానీ కుటుంబం తమ ఆరోగ్యం కోసం నీటి విషయంలో చేసే ఖర్చు సామాన్యులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిపుణుల విశ్లేషణ ప్రకారం.. అంబానీ కుటుంబం కేవలం దాహం తీర్చుకోవడానికి మాత్రమే నీటిని తాగదు. వారు తాగే నీరు వారి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి సహకరిస్తుంది. ఇందుకోసం వారు ప్రధానంగా నేచురల్ మినరల్ వాటర్, ఆల్కలీన్ వాటర్ తీసుకుంటారు.
అనేక వ్యాపార సమావేశాల్లో అంబానీ కుటుంబం ఆవా బ్రాండ్ నీటిని ఉపయోగిస్తూ కనిపించారు. ఈ నీరు ఆరావళి పర్వతాలలోని సహజ నీటి వనరుల నుండి సేకరిస్తారు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, సిలికా వంటి సహజ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని కృత్రిమంగా శుద్ధి చేయరు, కాబట్టి దాని సహజ రుచి, పోషకాలు అలాగే ఉంటాయి.
శరీరంలో pH స్థాయిని సమతుల్యంగా ఉంచడానికి, ఆమ్లత్వాన్ని తగ్గించడానికి అంబానీ కుటుంబం ఆల్కలీన్ వాటర్‌ను ప్రాధాన్యత ఇస్తుంది. వారి నివాసం యాంటిలియాలో అత్యాధునిక వాటర్ అయానైజర్లు అమర్చి ఉన్నాయి. ఇవి సాధారణ నీటిని హైడ్రోజన్ అధికంగా ఉండే ఆల్కలీన్ నీరుగా మారుస్తాయి.
అంబానీ కుటుంబం వాడే నీటి ధర సాధారణ నీటి కంటే వేల రెట్లు ఎక్కువ. 750 ml ప్రీమియం గ్లాస్ బాటిల్ ధర సుమారు రూ.1,000 నుండి రూ.1,200 మధ్య ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ ధర ప్యాకేజింగ్‌ను బట్టి రూ.439 నుండి ఏకంగా రూ.15,000 వరకు ఉంటుంది. నీటి నిర్వహణ, శుద్దీకరణ, సహజ మినరల్ వాటర్ కోసం అంబానీ కుటుంబం ఏడాదికి రూ.30 నుండి రూ.35 లక్షల వరకు ఖర్చు చేస్తుందని అంచనా. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంబానీ వంటి సంపన్న వ్యక్తులకు ఇది కేవలం ఖర్చు కాదు వారి ఆరోగ్యంపై పెట్టుబడి. స్వచ్ఛమైన, ఖనిజాలతో కూడిన నీరు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఇస్తుందని వారి నమ్మకం.