Explained: రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏంటో తెలుసా..?

దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం, ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థిరత్వాన్ని నియంత్రించడంలో RBI కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం రెపో రేటు, రివర్స్ రెపో రేటు, CRR, SLR వంటి ప్రధాన ద్రవ్య పరపతి సాధనాలను ఉపయోగిస్తుంది. ఈ రేట్లు, నిబంధనల మార్పుల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, పెట్టుబడుల ప్రవాహం ప్రభావితమవుతాయి. ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో ప్రస్తావించే నాలుగు రేట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Explained: రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏంటో తెలుసా..?
Repo Vs Reverse Repo

Updated on: Jun 05, 2026 | 3:31 PM

దేశంలో నగదు చలామణిని, ఆర్థిక స్థిరత్వాన్ని నియంత్రించడంలో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం RBI ద్రవ్య పరపతి విధాన సమీక్షలో (Monetary Policy Review) తన నియంత్రణలోని ముఖ్యమైన వడ్డీ రేట్లను సమీక్షించి, అవసరం మేరకు మార్పులు చేస్తుంది. ఈ కీలక వడ్డీ రేట్లలో చేపట్టే మార్పులు మార్కెట్‌లో డబ్బు ప్రవాహం, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం సమతుల్యానికి దోహదం చేస్తుంది. కీలక వడ్డీ రేట్లను యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ శుక్రవారంనాడు తాజా ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో ప్రస్తావనకు వచ్చే నాలుగు రేట్ల గురించి తెలుసుకుందాం.

1. రెపో రేటు (Repo Rate)

వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణానికి ఆర్బీఐ వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు. ఈ రేటు తగ్గితే బ్యాంకులకు తక్కువకు నిధులు లభిస్తాయి. దీంతో బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. రెపో రేటును ఆర్బీఐ పెంచితే.. ఆ మేరకు బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే రుణాలు ఖరీదుగా మారుతాయి.

2. రివర్స్ రెపో రేటు (Reverse Repo Rate)

వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉండే అదనపు నిధులను RBI వద్ద డిపాజిట్ చేస్తే.. ఆ మొత్తానికి RBI చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఇది సాధారణంగా రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో అనిశ్చితి ఉన్నప్పుడు బ్యాంకులు రిస్క్ తీసుకోకుండా RBI వద్ద డబ్బు ఉంచి స్థిరమైన వడ్డీ ఆదాయం పొందుతాయి.

3. నగదు నిల్వల నిష్పత్తి (CRR – Cash Reserve Ratio)

ప్రతి బ్యాంకు తమ డిపాజిట్లలో ఒక నిర్దిష్ట శాతాన్ని నగదు రూపంలో RBI వద్ద తప్పనిసరిగా ఉంచాలి. దీనిని CRR అంటారు. ఈ మొత్తంపై RBI ఎటువంటి వడ్డీ చెల్లించదు. CRR పెరిగితే బ్యాంకుల వద్ద రుణాల ఇచ్చేందుకు తక్కువ డబ్బు ఉంటుంది.. సీఆర్ఆర్ తగ్గితే ఎక్కువ రుణాలు ఇవ్వగలుగుతాయి.

4. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (SLR – Statutory Liquidity Ratio)

బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కొంత భాగాన్ని బంగారం, ప్రభుత్వ బాండ్లు లేదా ఇతర సురక్షిత ఆస్తుల రూపంలో నిల్వ చేయాలి. దీనిని SLR అంటారు. ఇది డిపాజిటర్ల సొమ్ముకు భద్రత కల్పించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.

ఈ నాలుగు కీలక రేట్ల ద్వారా RBI దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తూ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో ఆర్థిక వృద్ధికి అవసరమైన రుణ ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది.

Follow Us