
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2023-24 కేంద్ర బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొత్త పన్ను విధానంలో వివిధ మార్పులను ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లను సవరించారు. అలాగే రిబేట్ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త పన్ను విధానం కొత్త ఆర్థిక సంవత్సరంలో అందరికీ డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. అయితే మీరు పాత పన్ను విధానంలో కొనసాగాలనుకుంటే ఆ విషయాన్ని స్ఫష్టంగా పేర్కొనాలి. లేకపోతే మీ ఆదాయంపై పన్ను కొత్త పన్ను విధానం ప్రకారం లెక్కిస్తారు. పాత పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటుంది. కొత్త పన్ను విధానం కొన్ని ప్రయోజనాలను అందించినప్పటికీ పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్న అనేక పన్ను మినహాయింపులు వదులుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాత, కొత్త పన్ను విధానాల్లో మీరు క్లెయిమ్ చేయగల అన్ని మినహాయింపులు, అలాగే తగ్గింపుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
పాత పన్ను విధానం వ్యక్తులపై పన్ను భారాన్ని తగ్గించడంలో సహాయపడే వివిధ మినహాయింపులను అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 80సీ, 80 సీసీసీ, 80 సీసీడీ కింద కొన్ని మినహాయింపులు ఇచ్చారు. వీటిలో ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్, యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యూఎల్ఐపీ), ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన ఉన్నాయి. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే మీరు మీ హోమ్ లోన్ ఉపయోగించి కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ మీ హోమ్ లోన్ అసలు రీపేమెంట్‌పై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులను అందిస్తుంది. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం మీ హోమ్ లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీపై రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. అదనంగా, మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారు ఐటీ చట్టంలోని సెక్షన్ 80ఈఈ కింద మినహాయింపులను క్లెయిమ్ చేయడం ద్వారా తమ పన్ను బాధ్యతను రూ. 50,000 వరకూ తగ్గించుకోవచ్చు.
పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్న అనేక తగ్గింపులు, మినహాయింపులు డిఫాల్ట్ పన్ను విధానంలో లేవు. మీరు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. అలాగే సెక్షన్ 87ఏ కింద రూ. 7 లక్షల వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. కుటుంబ పెన్షనర్లు అయితే కొత్త పన్ను విధానంలో రూ. 15,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. మీ యజమాని మీ ఎన్‌పీఎస్ ఖాతాకు సహకరిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (2) ప్రకారం తగ్గింపులను క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి