ఈ మధ్య కాలంలో కంపెనీలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఆయా కంపెనీలు వివిధ పద్ధతుల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మార్గంలోనే గ్లోబల్ కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ ‘వీవర్క్ ఇండియా’ కూడా నడుస్తోంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. అదేంటంటే.. దీపావళి సందర్భంగా ఉద్యోగులందరికీ 10 రోజులపాటు సెలవులను ఇస్తున్నట్లు తెల్పింది. తమ ఉద్యోగులు వర్క్ నుంచి కాస్త విరామం తీసుకుని, కుటుంబంతో ఆనందంగా గడపాలనే ఉద్దేశ్యంతో సెలవును ప్రకటించినట్లు కంపెనీ చీఫ్ ప్రీతి శెట్టి వెల్లడించారు. సెలవుల వల్ల తమ కంపెనీ ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి, ఉత్సాహం, పునరుత్తేజం నింపేందుకు దీపావళి ఫెస్టివల్ హాలిడేస్ ఇస్తున్నల్లు ప్రీతి శెట్టి అన్నారు. ఈ ఏడాది మాత్రమేకాకుండా ప్రతి యేట దీపావళికి 10 రోజుల విరామం ఇవ్వడమనేది వార్షిక ఆచారం (యానువల్ రిచువల్)గా మార్చాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. కాగా న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ వీవర్క్ కంపెనీ భారత్‌లో పని చేసే ఉద్యోగులకు గత ఏడాది (2021) కూడా దీపావళికి 10 రోజుల విరామం ఇవ్వడం గమనార్హం.
ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మీషో తన సిబ్బందికి గత నెలలో 11 రోజులపాటు ‘సెట్ అండ్ రీఛార్జ్ బ్రేక్’ ప్రకటించింది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం తమకు చాలా ముఖ్యమని, అందుకే ఈ నెలలో కూడా సెలవులు మంజూరు చేసినట్లు తెల్పింది. మీషో ఫౌండర్ సంజీవ్ బర్న్వాల్.. కంపెనీ తన ఉద్యోగుల వర్క్ లైఫ్-పర్సనల్ లైఫ్ మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి అనుగుణంగా వరుసగా రెండో ఏడాది కూడా విరామం ఇస్తున్నట్లు తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
మానసిక ఆరోగ్యంపై డెలాయిట్ నిర్వహించిన ఓ సర్వేలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం బలహీనంగా ఉండటం, గైర్హాజరు, అట్రిషన్ కారణంగా ఏటా ఇండియన్ కంపెనీలకు 14 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతున్నట్లు తెల్పింది. వర్క్ ప్లేస్‌లో మానసిక ఆరోగ్యం ప్రధానాంశంగా నిర్వహించిన ఈ సర్వేలో వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల మానసిక స్థితిగతులను విశ్లేషించింది. ఈ సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది ఎంప్లాయిస్‌లలో అధిక శాతం మంది తాము ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం ఆఫీస్ స్ట్రెస్ అని తెలిపారు.