
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం, వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రభుత్వ విధానాల మద్దతుతో ఇప్పటికీ స్థిరంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నివేదిక పేర్కొంది. ఈ సంక్షోభం ప్రభావం ప్రధానంగా ఇంధన దిగుమతులు, సరఫరా గొలుసులు, ఎగుమతులు, ద్రవ్యోల్బణంపై కనిపిస్తోంది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరువ కావడంతో దిగుమతి బిల్లు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావం భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇది సవాలుగా మారవచ్చని భావిస్తున్నారు.
ఇక మధ్యప్రాచ్య దేశాలకు భారత ఎగుమతులపై కూడా ప్రభావం పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడం, సరుకు రవాణాలో జాప్యాలు ఏర్పడడం వల్ల తయారీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని పరిశ్రమలు ఇప్పటికే ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నాయి. విదేశీ పెట్టుబడుల పరంగా కూడా ఒత్తిడి కనిపిస్తోంది. 2026 ప్రారంభ నెలల్లో విదేశీ పెట్టుబడిదారులు భారీ మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పటికీ, దేశీయ పెట్టుబడిదారులు మార్కెట్‌ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే భారతదేశానికి కొన్ని బలమైన అంశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగం దేశీయ వినియోగంపై ఆధారపడి ఉండటం, బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండటం, భారీ విదేశీ మారక నిల్వలు, సేవల ఎగుమతుల వృద్ధి వంటి అంశాలు ప్రస్తుతం రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సంక్షోభం భారత్‌కు ఒక హెచ్చరిక వంటిది. భవిష్యత్తులో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధన వనరులను వేగంగా అభివృద్ధి చేయడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి