దేశంలో ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం అమలవుతోంది. దేశంలో తయారీ రంగాన్ని పరుగులు పెట్టించడం దీని ప్రధాన ఉద్దేశం. దీని కిందే ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తి కూడా జరుగుతోంది. అది ప్రగతి పథంలో పయనిస్తూ 2024లో దాదాపు రూ.లక్షకోట్లకు చేరుకోవడం గర్వపడాల్సిన విషయం. పీఎల్ఐ పథకం ద్వారా దేశంలో తయారీ రంగం పరుగులు తీస్తోంది. అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పన జరుగుతోంది. గతంలో 2014-15 సమయంలో దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 5.8 కోట్లు మాత్రమే ఉండేది. ఈ సంఖ్య 2023-24 నాటికి 33 కోట్లకు చేరుకుంది. దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎగుమతులు దాదాపు ఐదు కోట్లకు చేరుకున్నాయి. ఈ గణాంకాలే పీఎల్ఐ పథకం వల్ల కలిగిన ప్రయోజనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం మరింత విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో 2027 నాటికి 12 మిలియన్ల ఉద్యోగాలు కల్పిస్తారని అంచనా. వీటిలో ప్రత్యక్ష్యంగా మూడు మిలియన్లు, పరోక్షంగా తొమ్మిది మిలియన్లు ఉంటాయి. ఇక ప్రత్యక్ష ఉద్యోగాలలో ఒక మిలియన్ ఇంజినీర్లు, రెండు మిలియన్ల ఐటీఐ సర్టిఫైడ్ ఫ్రొషెషనల్స్, 0.2 మిలియన్ల ఏఐ, ఎంఎల్, డైటా సైన్స్ రంగాల నిపుణులకు అవకాశాలు లభిస్తాయి. వీటిలో పాటు మరో తొమ్మిది మిలియన్ల నాన్ టెక్నికల్ కొలువులు ఉంటాయని భావిస్తున్నారు. తాజాగా జరుగుతున్నపరిణామాల ప్రకారం భవిష్యత్తులో ఎక్కువమందికి ఈ రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయి.
రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ దూకుడు మరింత ఎక్కువ ఉండనుంది. ఈ పరిశ్రమ 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దానికి చేరుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. రాబోయే ఐదేళ్లలో దాదాపు ఐదు రెట్లు అభివృద్ధి సాధించాలి. అలాగే 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తి అంతరాన్ని తగ్గించాలి. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి కేవలం 101 బిలియన్ డాలర్లగా ఉంది. సాధారణంగా చైనా నుంచి ప్రపంచ దేశాలకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు భారీగా జరుగుతాయి. ఇప్పుడు ఆ స్థానంలోకి మన దేశం వచ్చే అవకాశం ఏర్పడింది. చైనాకు గట్టి పోటీ ఇస్తూ ఆ రంగంలో ముందుకు దూసుకుపోతోంది. ప్రముఖ కంపెనీలు కూడా మన దేశంలో వాటి ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈ మార్కెట్ చైనా నుంచి మన దేశానికి మారుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎల్ఐ పథకంలో ఇది సాధ్యమైందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి