
ఆంధప్రదేశ్‌కు రైల్వేశాఖ మరో భారీ శుభవార్త అందించింది. ఏపీలో పలు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రకటించిన బడ్జెట్‌లో కేవలం హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా చెన్నై, బెంగళూరుకు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఇక చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు జిల్లా మీదుగా వెళ్లనుంది. ఇవే కాకుండా ఏపీలో మరో రెండు హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయగా.. ఫైనల్ లొకేషన్ సర్వే త్వరలో చేపట్టేందుకు సిద్దమవుతోంది. లొకేషన్ సర్వే నిర్వహించేందుకు అనుమతి కోసం రైల్వే బోర్డుకు రైల్వే అధికారులు ప్రతిపాదన పెట్టారు. రైల్వేబోర్డు నుంచి అనుమతి వచ్చాక అధికారులు సర్వే నిర్వహించనున్నారు.
కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను ప్రకటించింది. ఇందులో ఏపీ నుంచి మూడు లైన్లు వెళ్లనున్నాయి. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు లైన్లు ఏపీ మీదుగా వెళ్లనుండగా.. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ-విశాఖపట్నం మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇక విజయవాడ-కర్నూలు మధ్య మరో సెమీ హైస్పీడ్ కారిడార్‌కు సిద్దమవుతోంది. ఇక ఈ రెండు లైన్లతో పాటు మరో ఆరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ సిద్దమవుతోంది. వీటి కోసం త్వరలో సర్వే చేపట్టనుంది. భవిష్యత్తులో రాజధాని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరిగేలా రైల్వేశాఖ ఈ కొత్త రైల్వేలైన్లకు శ్రీకారం చుట్టింది.
విజయవాడ-విశాఖపట్నం హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ 350 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇది ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖకు వెళ్తుంది. గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లు ఈ రెండు ప్రాంతాల మధ్య తిరుగుతాయి. ఈ కొత్త కారిడార్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్‌కు ఇది కనెక్ట్ అవుతుంది. దీంతో అమరావతి నుంచి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ రైల్ కనెక్టివిటీ మరింత పెరగనుంది. ఇక విజయవాడ-కర్నూలు మధ్య ప్రస్తుతం నేరుగా ప్రయాణించేందుకు రైళ్లు లేవు. డోన్ లేదా నంద్యాలలో దిగి కర్నూలుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ రెండు ప్రాంతాలకు నేరుగా ప్రయాణించేందుకు విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మించడంపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. . గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా ఇది వెళ్తుంది.