Nitin Gadkari: దేశంలోని అన్ని ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఏడాదిలోపు దేశంలోని పెట్రోల్ వాహనాల ధరకు సమానంగా ఉంటాయని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు. పెట్రోలు, డీజిల్‌కు బదులుగా పంట అవశేషాల నుంచి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గడ్కరీ వెల్లడించారు.
ఒక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల ధర దేశంలోని పెట్రోల్ వాహనాల ధరకు సమానంగా తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నానని నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాలపై ఖర్చు చేసే డబ్బును ఆదా చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే హరిత ఇంధనాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. రహదారి కంటే జలమార్గాలు మనకు చౌకైన రవాణా మార్గం అని గడ్కరీ అన్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు అందుబాటు ధరల్లోకి తీసుకురావటానికి, కర్బన ఉద్ఘారాను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు.