ట్రంప్‌ సుంకాలు.. బంగారం, వెండి కొనాలా? వద్దా? నిపుణుల సలహా ఇదే!

అమెరికా సుప్రీం కోర్టు ఎదురుదెబ్బ తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త 10-15 శాతం గ్లోబల్ సుంకాలు ప్రపంచ వాణిజ్య వాతావరణంలో అనిశ్చితిని పెంచాయి. ఈ పరిణామాలు బంగారం, వెండి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి.

ట్రంప్‌ సుంకాలు.. బంగారం, వెండి కొనాలా? వద్దా? నిపుణుల సలహా ఇదే!
Gold And Silver 1

Updated on: Feb 23, 2026 | 2:12 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య విధానానికి అమెరికా సుప్రీం కోర్టు నుంచి గణనీయమైన ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఆయన కొత్త సుంకాల నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు మళ్లీ దృష్టి సారించాయి. కోర్టు ఆయన విస్తృత సుంకాల చర్యలను కొట్టివేసిన కొద్దిసేపటికే, ట్రంప్ అన్ని దేశాల దిగుమతులపై 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధించే ఉత్తర్వుపై సంతకం చేశారు. అనంతరం ఈ సుంకాన్ని 15 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో చేసిన ప్రకటనలో అమెరికా ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా అనుమతించదగిన కొత్త సుంకాలను రాబోయే నెలల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చే ప్రయత్నం కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ప్రపంచ వాణిజ్య వాతావరణంలో అనిశ్చితి పెరిగింది.

ఈ పరిణామాల ప్రభావం విలువైన లోహాల మార్కెట్‌పై పడే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. SS వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా అభిప్రాయం ప్రకారం వృద్ధి మందగించడం, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడులు బంగారం, వెండి వంటి ఆస్తుల్లో అస్థిరతను పెంచవచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మారుతున్న వాణిజ్య పరిస్థితులు సురక్షిత పెట్టుబడులపై డిమాండ్‌ను బలపరుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ ప్రకారం విలువైన లోహాలు ఇప్పటికీ పెరుగుతున్న ట్రెండ్‌లోనే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మార్కెట్ అంతర్గత గణాంకాలు లోహాల్లో కొనుగోలు ఆసక్తి కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయని ఆయన చెప్పారు.

SEBI నమోదు పొందిన మార్కెట్ నిపుణుడు అనుజ్ గుప్తా విశ్లేషణ ప్రకారం.. స్వల్పకాలిక పెట్టుబడిదారులు వెండిపై దృష్టి పెట్టవచ్చు. పారిశ్రామిక వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల వెండికి సమీపకాలంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మధ్యస్థ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు బంగారం ఇంకా సురక్షిత ఆశ్రయంగా మిగులుతుందని సూచించారు. మొత్తంగా ట్రంప్ సుంకాల నిర్ణయం ప్రపంచ వాణిజ్యంతో పాటు బంగారం, వెండి మార్కెట్‌లో కూడా అనిశ్చితిని పెంచుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us