చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు చెప్పండి..అందరికీ ఇష్టమే. అయితే వీటి ధర చూసి కొందరు అప్పుడప్పుడూ మాత్రమే కొనుగోలు చేస్తారు. వారానికి ఒకసారైతే ఖచ్చితంగా ముక్క ఉండాల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా చికెన్ ధరల్లో మార్పు కనిపిస్తోంది. గడిచిన 20 రోజులుగా దాదాపు 22శాతం వరకూ ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. అసలు చికెన్ ధరలు ఎందుకు పడిపోతున్నాయి అనే అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతోంది. మరికొందరిలో అయితే కోళ్లకు ఏవైనా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయా అనే ఆందోళన కూడా లేకపోలేదు.
ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధరలు తగ్గుదలపై ఈగల్ ఫిషరీస్ సంస్థ అధినేత సయ్యద్ ఫయజుద్దీన్ వివరణ ఇచ్చారు. సామాన్యులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేస్తూ వివరణ ఇచ్చారు. అక్టోబర్ 29 నుంచి కార్తీక మాసం ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఈ సమయంలో చాల మంది గృహిణులు ఇంట్లో, గుళ్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక పురుషులైతే అయ్యప్ప మాల పేరుతో మండలం రోజుల పాటూ దీక్షలు చేస్తూ ఉంటారు. దీంతో మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూర్తి శాఖాహారులుగా మారిపోతారు.
ఈ క్రమంలో చికెన్‌పై డిమాండ్ తగ్గి, సప్లై పెరగడంతో ధరల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాట్లు వివరించారు. ఈ మాసం మొత్తం పూర్తి ఆధ్యాత్మిక భావనతో ఉంటారు హిందువులు. అందుకే మాంసాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించరు. చికెన్‌తో పాటూ గుడ్లు కూడా తినడానికి మక్కువ చూపించరు. దీంతో చికెన్ ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈనెల 27తో కార్తీకమాసం పూర్తవుతుంది. ఆ తరువాత తిరిగి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు తిరిగి చికెన్ ధరలు పెరిగుతాయని చెబుతున్నారు. హైదరాబాద్‌లో నవంబర్ 3వ తేదీన లైవ్ చికెన్ కిలో రూ. 140 ఉండగా, ఇప్పుడు 126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్‌లెస్ చికెన్ రకాల్లోనూ ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..