
Flights India: ఇటీవల విమానాల రద్దు ఘటనలు భారత్‌లో ఎక్కువగా చూస్తున్నాం. ఇండిగో విమానాలు హఠాత్తుగా రద్దు కావడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల్లో ఇండిగో విమానాలు భారీగా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో కేంద్రం కూడా ఆ విమానయాన సంస్థపై సీరియస్ అయింది. ఈ క్రమంలో ప్రయాణిలకు ఇండిగో క్షమాపణలు తెలిపింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య టికెట్లు బుక్ చేసుకున్నవారికి పూర్తి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది. అయితే విమానం క్యాన్సిల్ అయినప్పుడు ఎలా రీఫండ్ పొందాలి..? ఇందుకు పాటిచాల్సిన పద్దతులు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
రీఫండ్ పొందాలంటే మీరు టికెట్ బుక్ చేసుకున్న ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి అందులో ‘మేనేజ్ బుకింగ్స్’ అనే ఆఫ్షన్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ పీఎన్‌ఆర్ లేదా బుకింగ్ రిఫరెన్స్, మీ లాస్ట్ నేమ్‌ను ఎంటర్ చేయండి. అక్కడ మీరు వెళ్లాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిందో.. లేదో చూడండి. ఒకవేళ రద్దు అయినట్లు చూపిస్తే మీకు ఫుల్ రీఫండ్ లేదా రీబుక్ అనే రెండు ఆప్షన్లు నిపిస్తాయి. రీఫండ్ కావాలంటే పీఎన్‌ఆర్, ఈమెయిల్ ఐడీ, మన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. మీకు 5 నుంచి 7 రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్లో రీఫండ్ క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆఫ్‌లైన్ విధానంలో టికెట్ బుక్ చేసుకుని ఉంటే ఎయిర్‌పోర్ట్ టికెట్ కౌంటర్‌ను సంప్రదిస్తే డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా టికెట్ బుక్ చేసుకుని ఉంటే వారిని సంప్రదిస్తే సరిపోతుంది.
రీఫండ్ కాకుండా మీరు రీబుకింగ్ చేసుకుంటే ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం టికెట్ క్యాన్సిల్ అయినప్పుడే ఆ సమాచారంతో పాటు మీకు రీబుకింగ్ లింక్‌ను మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఫ్లైట్ 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైనా లేదా క్యాన్సిల్ అయినా ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ ఇవ్వాలని డీజీసీఏ నిబంధనలు చెబుతున్నాయి. లేకపోతే అదే టికెట్ మొత్తంపై వేరే ఫ్లైట్‌లో ప్రయాణ సౌకర్యం కల్పించాలి. నాన్ రిఫండబుల్ టికెట్లకు కూడా అసాధారణ పరిస్థితుల్లో పూర్తి రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల్లో ఫ్లైట్ ఆలస్యమైనప్పుడు రీఫండ్ ఇవ్వకపోవచ్చు.