ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం తేనే. పురాతన కాలం నుండి, తేనెను యాంటీ బ్యాక్టీరియల్‌గా భావిస్తారు. ప్రతి ఇంట్లో తప్పని సరిగా తేనె ఉంటుంది. తియ్యగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రపంచవ్యాప్తంగా తేనె భిన్న రకాలుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. నాణ్యతను బట్టి దాని ధర మారుతుంది. కానీ ఏ తేనె అయినా సరే దాదాపుగా రుచి ఒక్కలాగే ఉంటుంది. అందులో ఉండే ఔషధ విలువలు కూడా ఒక్కలాగే ఉంటాయి. తేనె మహా అయితే కిలో రూ.400 నుండి రూ. 600 వరకు ఉంటుంది. మంచి నాణ్యమైన తేనే అయితే రూ. వెయ్యి వరకు ఉండొచ్చు. అయితే ఎల్విష్ తేనె మాత్రం భిన్న రకానికి చెందిన తేనెను ఉత్పత్తి చేస్తుంది. వీరు తయారు చేసిన తేనె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. ఈ తేనె ధర ఎంతో తెలిస్తే..గుండె గుబేల్ మంటుంది. ఎందుకంటే ఇది బంగారం కన్నా ఖరీదైనది. అంతేకాదు..ఈ తేనెకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఎల్విష్ తేనె అనేది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన, అత్యంత ఖరీదైన తేనె. ఈ తేనె టర్కీలోని ఆర్ట్విన్ నగరంలో 1800 మీటర్ల లోతైన గుహ నుండి సేకరిస్తారు. తేనె తయారీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేనెను విక్రయిస్తోంది. ఒక కిలో ఎల్విష్ తేనె ధర కిలోకు 10,000 యూరోలు. ఇది భారత కరెన్సీలో కిలోకు దాదాపు రూ. 9 లక్షలు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ లైఫ్ మెయిల్ హనీ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైనది. రెండవ అత్యుత్తమ నాణ్యత కలిగినది. ఇది కిలోకు 500 యూరోలు అంటే భారతీయ ధరల ప్రకారం కిలోకు రూ. 50 వేలు.
ఈ తేనె ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సాధారణ తేనె వలె తీపిగా ఉండదు. కొంచెం చేదుగా ఉంటుంది. కానీ, చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం మొదలైన అనేక పోషకాలు ఈ తేనెలో పుష్కలంగా లభిస్తాయి. సాధారణ తేనెలాగా ఏడాదికి రెండు మూడు సార్లు కాకుండా ఏడాదికి ఒకసారి మాత్రమే తీయడం వల్ల ఈ తేనె ఇప్పటికీ ఎక్కువ ధరకే అమ్ముడవుతోంది. ఈ తేనెను తీసే విధానం కూడా భిన్నంగా ఉంటుంది.
ఈ తేనె నాణ్యతను పెంపొందించడానికి, కంపెనీ దీనిని నగరంలోని రద్దీ ప్రాంతాలకు దూరంగా అటవీ గుహలో తయారు చేస్తుంది. ఈ గుహ చుట్టూ ఔషధ మొక్కలు పెరుగుతాయి, కాబట్టి తేనెటీగలు ఔషధ తేనెను తయారు చేయడానికి పువ్వుల రసాన్ని సిప్ చేస్తాయి. ఈ తేనెను మార్కెట్లో విక్రయించే ముందు, దాని నాణ్యతను టర్కిష్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే దానిని వినియోగదారులకు విక్రయించడానికి అనుమతిస్తుంది.