
ఆన్ లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అదే స్థాయిలో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. నకలీ వెబ్ సైట్లతో లాభాల ఆశ చూపి నట్టేట ముంచుతున్నారు. దేశంలో ఆన్‌లైన్ స్టాక్ పెట్టుబడి మోసాలు పెరిగాయి. కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా వందల మంది ఈ స్కామ్‌ల బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నారు.
ఢిల్లీకి చెందిన మొహమ్మద్ దౌద్ అనే 29 ఏళ్ల యువకుడు ఒక నకిలీ వెబ్ సైట్ ను రూపొందించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు అందజేస్తామని దానిలో వివరించాడు. అది నిజమని నమ్మిన 32 ఏళ్ల మహిళ ఆన్ లైన్ లో మొహమ్మద్ దౌద్ ను సంప్రదించింది. అతడు మొదట రూ. 1,000 పెట్టుబడి పెట్టాలని ఆమెను ఒప్పించాడు. ఆ మహిళ అలా చేయగానే రూ. 1,300 రాబడి వచ్చింది. దీంతో ఆమె నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టింది. సుమారు 23.5 లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆమె ఫోన్ కు దౌడ్ స్పందించడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు రంగంలోకి దిగి దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని మౌజ్ పూర్ ప్రాంతంలో దౌద్ ను అరెస్టు చేశారు. అతడి నుంచి 17 సిమ్‌కార్డులు, 11 డెబిట్ కార్డులు, నాలుగు పాస్ పుస్తకాలు, 15 చెక్ బుక్‌లు, రెండు స్టాంపులు, ఒక ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దౌద్ బ్యాంకు ఖాతా నుంచి రూ.8.55 లక్షలు రికవరీ చేశారు. మిగిలిన డబ్బు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్టు గుర్తించారు. దౌద్ తన సహచరుడి సాయంతో ఇలా మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతడిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.
స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) పెట్టుబడిదారులను హెచ్చరించింది. స్టాక్ మార్కెట్‌లో గ్యారెంటీ రిటర్న్‌లను అందించే ఏవైనా పథకాలు, ఉత్పత్తులకు సభ్యత్వం తీసుకోవద్దని సూచించింది. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ఆధారాలైన యూజర్ ఐడీ/పాస్‌వర్డ్ లేదా ఇతర సమాచారాన్ని ఎవరికి చెప్పకూడదని సూచించింది. సెబీ వెబ్‌సైట్‌లో ఎంటీటీల రిజిస్టర్డ్ స్టేటస్‌ను వెరిఫై చేయాలని ఇన్వెస్టర్లను కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..