Electric vehicles: ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలకు కారణమిదే.. ఈ విషయాలు తెలిస్తే నో టెన్షన్
మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతూ పోతోంది. ఎక్కడ చూసినా ఈ వాహనాలు పరుగులు తీస్తూ కనిపిస్తున్నాయి. సంప్రదాయ పెట్రోలు వాహనాలకు బదులుగా వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే మన దేశ జనాభాతోె పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అతి తక్కువ స్థాయిలోనే ఉందని చెప్పవచ్చు. పట్టణాల్లో పర్వాలేదు గానీ గ్రామీణులు మాత్రం వీటికి దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల నుంచి మంటలు వస్తాయని, బ్యాటరీలు పేలిపోతాయనే భయమే అని చెప్పవచ్చు. పత్రికలు, సోషల్ మీడియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోతున్న వీడియోలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీలు భద్రమేనా, వాటి నుంచి మంటలు రావడం వెనుక కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లు లిథియం – అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. ఈ బ్యాటరీలు చాలా చిన్న స్థలంలో శక్తిని నిల్వ చేస్తాయి. దాని ద్వారా వాహనం పరుగులు తీస్తుంది. అయితేే వేడెక్కడం, బ్యాటరీలో నష్టం, పేలవమైన వైరింగ్ కారణంగా థర్మల్ రన్అవే అనే స్థితి ఏర్పడుతుంది. అప్పుడు బ్యాటరీల నుంచి మంటలు వస్తాయి. చౌకయిన, నియంత్రణ లేని, తప్పుగా అసెంబుల్ చేసిన వాహనాల్లోనే ఈ సమస్య ఏర్పడుతుంది. అలాంటి వాటి నుంచే మంటలు వస్తాయి. విశ్వసనీమైన బ్రాండ్ల నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆ వాహనాల్లో బ్యాటరీని సురక్షితంగా ఉంచే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఈ కింద తెలిపిన అంశాలు చాలా ప్రధానంగా ఉంటాయి.
బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (బీఎంఎస్)
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ (బీఎంఎస్) ముఖ్యమైంది. ఇది బ్యాటరీకి మొదడు లాంటింది. ఉష్ణోగ్రత, లోవోల్టేజీ, విద్యుత్ ను తనిఖీ చేస్తుంది. వాటిని సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది.
ఉష్ణ రక్షణ
బ్యాటరీ వేడెక్కితే, దాన్ని చల్లబరిచే వ్యవస్థ ఉండాలి. ప్రముఖ బాండ్ల వాహనాల్లో ఈ సిస్టమ్ ఉంటుంది.
బ్యాటరీ భద్రత
బ్యాటరీ బాక్స్ దెబ్బతినకుండా చూసుకోవడం చాలా అవసరం. దీని కోసం ప్రముఖ కంపెనీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాయి.
సాఫ్ట్ వేర్ హెచ్చరికలు
బ్యాటరీలో, వాహనంలో ఏవైనా ఇబ్బందులు కలిగితే స్క్రీన్ లేదా ఫోన్ యాప్ లో హెచ్చరికలు వచ్చే టెక్నాలజీ ఉండాలి.
పరీక్షలు
వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేసే ముందే వివిధ పరీక్షలు జరిపాలి. వాటిలో డ్రాప్, వాటర్ రెసిస్టెన్స్, వైబ్రేషన్, థర్మల్ పరీక్షలు ఉంటాయి. ప్రముఖ బ్రాండ్లు ఈ పరీక్షలు చేసిన తర్వాాతే వాహనాలను విడుదల చేస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రతలు
- ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వినియోగించేవారు కొన్ని జాగ్రతలు తీసుకోవడం వల్ల ప్రమాదాల నుంచి దూరంగా ఉండవచ్చు.
- రాత్రి సమయంలో ఇంటిలో వాహనాన్ని చార్జింగ్ చేయకూడదు. ఖాళీగా, వెలుతురు వచ్చే స్థలంలో చేసుకోవాలి.
- ప్రతి రోజూ వంద శాతం వరకూ చార్జింగ్ పెట్టకూడదు. 80 నుంచి 90 శాతానికి రాగానే ఆపేయాలి. దీని వల్ల బ్యాటరీపై ఒత్తిడి ఉండదు. ఎక్కువ కాలం పనిచేస్తుంది.
- కంపెనీ ఆమోదించిన చార్జర్లను మాత్రమే వినియోగించాలి.
- మీ యాప్, డాష్ బోర్డు హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలి.
- ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎప్పటి కప్పుడు సర్వీసింగ్ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




