
Silver Price: గత కొద్ది నెలలుగా బంగారం రేట్లు ఊహించని విధంగా హైక్ అవుతుండగా.. దానికి పోటీగా వెండి రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు ఇవాళ రికార్డు స్థాయిలో పెరిగి 2 లక్షల మార్క్‌ను దాటాయి. ఏడాది క్రితం కేజీ వెండి లక్ష దాటడంతో వామ్మో అని అందరూ అనుకున్నారు. కానీ క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు గోల్డ్‌ను దాటేసి 2 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో భారత్‌లో వెండి ధర బ్రేక్‌లు లేకుండా దూసుకుపోతుంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న అంచనాలు కూడా వెండి రేట్లు పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వెండి రేట్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,01,100గా కొనసాగుతోంది. వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
గత రెండు ఏళ్ల నుంచి సరఫరా కంటే వెండికి డిమాండ్ పెరిగింది. ధరల పెరుగుదలకు ఇదొక కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో కొరత కారణంగా మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఇక వెండి తుప్పు పట్టదు కాబట్టి కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, స్విచ్‌లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, కనెక్టర్లు వంటి ఎలక్ట్రానిక్, విద్యుత్ కనెక్షన్ల కోసం ఉపయోగిస్తున్నారు. వెండి రేట్లు పెరగుదలకు ఇదొక కారణంగా చెబుతున్నారు.
ఇక వెండిని ఏరోస్సేస్, అంతరిక్ష పరిశోధనల్లో కూడా ఉపయోగిస్తు్న్నారు. ఉపగ్రహాలు, రాకెట్లు, అంతరిక్ష నౌకలు వంటి వాటిల్లో విద్యుత్ ప్రసారం కోసం వెండిని ఉపయోగిస్తున్నారు. అంతరిక్షంలో అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి పూతగా ఉపయోగిస్తున్నారు. ఇక దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటితో పాటు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, ఇమేజింగ్ పరికరాల్లో ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు నానోటెక్నాలజీ పరికరాలు, గ్లాస్, కిటికీలు వంటి వాటిని వినియోగిస్తున్నారు. ఇక సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు, పారిశ్రామిక రసాయనాలు వంటి వాటిల్లో కూడా ఉపయోగిస్తు్న్నారు.