మన దేశంలో ఎక్కువమంది ప్రజలు ప్రయాణించే రవాణా సాధనం రైలు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ రైలు మార్గాలు విస్తరించడంతో పాటు మిగిలిన వాటితో పోల్చితే చార్జీలు చాలా తక్కువగా ఉండడం దీనికి కారణం. అత్యధిక రద్దీ కలిగిన రవాణా వ్యవస్థ కూడా ఇదే. రైలులో ప్రయాణించాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవడం, లేకపోతే జనరల్ బోగీలలో ఇబ్బందులు పడుతూ ప్రయాణించడం అందరికీ తెలిసిందే. వీటిని పక్కన పెడితే రైలు ప్రయాణికులు ఎక్కువగా ఇబ్బంది పడేది భోజనం కోసమే.
సాధారణంగా రైలు ప్రయాణం సుధీర్ఘంగా ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి దాదాపు ఒక రోజుకు మించి సమయం పడుతుంది. ఉదాహరణకు ఒక్క రోజు ప్రయాణంలో సమయాన్ని బట్టి దాదాపు రెండు సార్లు భోజనం చేయాల్సి ఉంటుంది. రైలులో భోజనం లభ్యమైనా దాని ధర ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సాధారణ బోగీలలో ప్రయాణించేవారి ఇబ్బందులను తొలగించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. కేవలం రూ.20కే భోజనం అందజేస్తుంది. సాధారణ బోగీలలో ప్రయాణించే వారిలో చాలా మంది ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడతారు. వారికి రోజూ ఒక కప్పు కాఫీ, ప్రాథమిక మధ్యాహ్న భోజనాన్ని కొనుగోలు చేయడం కూడా సవాలుగా ఉంటుంది. ఈ పరిస్థితిని గుర్తించిన రైల్వే రూ. 20కే ఎకానమీ భోజనం అందించే చర్యలు చేపట్టింది.
అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ భోజనాన్ని రూపొందించారు. ఇవి మొదట ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని దాదాపు వంద స్టేషన్లలో ఇలాంటి భోజనాన్ని అందించే 150 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఆగిపోయే ప్రాంతాల్లో ఇవి ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని స్టేషన్‌లకు ఈ కౌంటర్లను విస్తరించనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే మార్గంలో హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, ధోనే, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్‌తో సహా పలు కీలక ప్రదేశాలలో ఈ కౌంటర్లు ప్రారంభమయ్యాయి..
జనరల్ బోగీ ప్రయాణికుల కోసం రూపొందించిన ఈ రూ.20 భోజనాన్ని జనతా ఖానా లేదా ఎకానమీ మీల్ అని పిలుస్తున్నారు. దీనిలో ఏడు పూరీలు (175 గ్రా), బంగాళదుంప కూర (150 గ్రా), పచ్చళ్లు (15 గ్రా) ఉంటాయి. అయితే దీనిని ఇష్టపడని వారికి ఐఆర్‌సీటీసీ రూ.50 ధరకు మరో ఎకానమీ భోజనం అందిస్తుంది. దానిలో తైరు సాదం, సాంబార్ రైస్, లెమన్ రైస్, రాజ్మా, చోలే చావల్, కిచ్డీ, పొంగల్, కుల్చా, చోలే బతురా, పావ్ బాజీ. మసాలా దోస ఉంటాయి. ప్రయాణికులకు ఎకానమీ భోజనం అందించడానికి వారి విభిన్న ప్రాధాన్యతలను ఐఆర్‌సీటీసీ పరిగణనలోకి తీసుకుంది. వేసవి సెలవులలో చాలా మంది రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారు. వారందరికీ తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..