Mutual Fund
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తి గా దీని కోసం ఎదురు చూశారు. బడ్జెట్ లో పలు రంగాలకు రాయితీలు, మినహాయింపులు, సబ్సిడీలు కల్పించారు. పన్ను చెల్లింపు విధానాల్లోనూ కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా వివిధ రకాల ఆస్తులకు మూలధన లాభాల పన్ను విధానంలో మార్పులు చేశారు. స్వల్పకాలిక మూలధన లాభాలు (షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్-ఎస్టీసీజీ), దీర్ఘకాలిక మూలధన లాభాలు (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్-ఎల్టీసీజీ) ట్యాక్స్ లలో కూడా కొన్ని సవరణలు చేశారు. వాటి హోల్డింగ్ పీరియడ్ లను మార్చారు. దీనివల్ల ఈక్విటీ, డెట్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీలో పెట్టుబడులపై ప్రభావం పడనుంది.
మరిన్ని మార్పులు..
బడ్జెట్‌లో ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించారు. లిస్టెడ్ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిపై దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్ టీసీజీ) మినహాయింపు పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 1.25 లక్షలకు పెంచారు. స్వల్పకాలిక మూలధన లాభాల (ఎస్టీసీజీ) కోసం పన్ను రేటు 20 శాతానికి పెంచారు. ప్రస్తుతం నిర్దిష్ట ఆస్తులపై ఎల్టీసీజీ పన్ను రేటు 12.5 శాతంగా ఉంది. అలాగే ఈక్విటీ లావాదేవీల కోసం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ను 0.1 శాతం నుంచి 0.2 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమైన అంశాలు..
కొత్త మూలధన లాభాల పన్ను ప్రతిపాదనలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) పలు అంశాలను తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖలో ఒక భాగమైన సీబీడీటీ వెల్లడించిన విషయాలను తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్ లో జరిగిన ప్రధాన మార్పులు ఇవే..
- మూలధన లాభాలపై పన్ను విధించే విధానంలో మార్పులు చేశారు. ముఖ్యంగా హోల్డింగ్ వ్యవధి సరళీకృతం చేశారు. కేవలం రెండు పిరియడ్ లు అంటే ఏడాది, రెండేళ్లు మాత్రమే నిర్ణయించారు. ఏకకాలంలో గణన సౌలభ్యం కోసం ఇండెక్సేషన్ తొలగించారు. దేశ నివాసితులతో పాటు నాన్-రెసిడెంట్లకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. రోల్ ఓవర్ ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేదు.
- మూలధన లాభాలపై పన్ను విధించే కొత్త నిబంధనలు జూలై 23 నుంచి అమల్లోకి వస్తాయి.
- ఆస్తిని దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణించడానికి గతంలో మూడు హోల్డింగ్ పీరియడ్‌లు ఉండేవి. ఇప్పుడు వాటిని రెండుగా చేశారు. లిస్టెడ్ సెక్యూరిటీల కోసం ఒక సంవత్సరం, అన్ని ఇతర ఆస్తులకు, ఇది రెండేళ్లు నిర్ణయించారు.
- జాబితా చేసిన అన్ని ఆస్తుల హోల్డింగ్ వ్యవధి ఇప్పుడు ఒక ఏడాది ఉంటుంది. అందువల్ల వ్యాపార ట్రస్ట్‌ల లిస్టెడ్ యూనిట్ల హోల్డింగ్ వ్యవధి 36 నెలల నుంచి 12 నెలలకు తగ్గుతుంది. బంగారం, అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల (లిస్టెడ్ షేర్లు కాకుండా) హోల్డింగ్ పీరియడ్ కూడా 36 నెలల నుంచి 24 నెలలకు తగ్గించారు.
- స్థిరాస్తి, జాబితా చేయని షేర్ల హోల్డింగ్ వ్యవధి గతంలో మాదిరిగా 24 నెలలే ఉంటుంది.
- స్వల్పకాలిక ఎస్ టీటీ చెల్లింపు లిస్టెడ్ ఈక్విటీ, ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్, బిజినెస్ ట్రస్ట్ యూనిట్ల (సెక్షన్ 111ఏ) రేటు 15 నుంచి 20 శాతానికి పెరిగింది. దీర్ఘకాలిక (సెక్షన్ 112ఏ) కోసం 10 నుంచి 12.5 శాతానికి పెంపుదల చేశారు.
- సెక్షన్ 112ఏ కింద దీర్ఘకాలిక మూలధన లాభాల మినహాయింపు పరిమితిలో ఇంతకుముందు లక్ష రూపాయలు ఉండేది. దానికి రూ.1.25 లక్షలకు పెంచారు. ఈ పెరిగిన మినహాయింపు పరిమితి ఏవై 2024-25 నుంచి వర్తిస్తుంది.
- అన్ని ఆస్తులపై ఇతర దీర్ఘకాలిక మూలధన లాభాల రేటు సూచిక లేకుండా 12.5 శాతానికి మార్పు చేశారు. అంతకుముందు సూచికతో 20 శాతంగా ఉండేది.
- రేటును 20 శాతం (ఇండెక్సేషన్‌తో) నుంచి 12.50 శాతానికి (ఇండెక్సేషన్ లేకుండా) మార్చడం వల్ల అన్ని వర్గాల ఆస్తులకు ప్రయోజనం చేకూరుతుంది. పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారు. అయితే ద్రవ్యోల్బణంతో పోలిస్తే లాభం పరిమితంగా ఉన్నప్పుడు ప్రయోజనం కూడా తక్కువగానే ఉంటుంది.
- మూలధన లాభాలపై రోల్ ఓవర్ ప్రయోజనాలను మునుపటి మాదిరిగానే ఉంటాయి. ఐటీ చట్టం కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న రోల్ ఓవర్ ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..