March Changes: మార్చి 1 తేదీ నుంచి చాలా విషయాలలో మార్పులు సంభవిస్తు్న్నాయి. ఛార్జీలు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల జేబులకి మళ్లీ చిల్లుపడక తప్పదు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించిన అనేక నియమాలు మారుతున్నాయి. ఈ కొత్త మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో ఒకటి అమూల్ పాల ధరల పెంపు. ఈ పాల కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ధరలు పెంచింది. ఢిల్లీ ఎన్‌సిఆర్, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతాలలో మార్చి ఒకటి నుంచి పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే మరోసారి గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. మార్చి 1 నుంచి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు రూ.105 పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,012 కానుంది. 5 కిలోల సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో 569 రూపాయలు పలుకుతోంది.
ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా క్లోజ్‌పై రూ.150 + GST వసూలు చేయడానికి సిద్దంగా ఉంది. ఈ నియమం మార్చి 5 2022 నుంచి వర్తిస్తుంది. దీంతో ఖాతాదారులకి తప్పవు తిప్పలు. అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్ (LVB) అన్ని శాఖలు DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (DBIL)లో విలీనం అవుతున్నాయి. కస్టమర్‌లు ఇప్పుడు NEFT/RTGS/IMPS నిధులను పొందడానికి కొత్త IFSC & MICR కోడ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. పాత IFSC కోడ్‌లు ఫిబ్రవరి 28, 2022 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. 1 మార్చి 2022 నుంచి కస్టమర్‌లు కొత్త DBS IFSC కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే పెన్షన్ దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఫిబ్రవరి 28 చివరితేదీగా నిర్ణయించింది. ఈ గడువును పొడిగించడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షన్ దారులు మార్చి 1 నుంచి ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.