
దేశంలో ఇటీవల మ్యూల్ అకౌంట్లు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్‌బీఐ ప్రతీ రోజు వేల సంఖ్యలో మ్యూల్ అకౌంట్లను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. ఇక దర్యాప్తు సంస్దలు కూడా ఇటువంటి ఖాతాలను గుర్తించి బ్లాక్ చేస్తోంది. కొంతమంది కమీషనర్లకు కక్కుర్తి పడి తమ అకౌంట్లను ఇతరులకు ఇస్తున్నారు. డబ్బు కోసం ఆశపడి ఇతరులకు ఇవ్వడం ద్వారా ఆ అకౌంట్ల ద్వారా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సైబర్ నేరగాళ్లు ఇటువంటి అకౌంట్లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. అసలు మ్యూల్స్ అకౌంట్ ఏంటి..? మీ పేరుపై ఆ అకౌంట్ ఉందని ఎలా తెలుసుకోవాలి..? ఉంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
డబ్బు కోసం మీ అకౌంట్‌ను అక్రమాలకు పాల్పడే వారికి అందిస్తే దానిని మ్యూల్ అకౌంట్ అంటారు. అలాగే నేరస్తులు ఇతరుల డాక్యుమెంట్స్‌తో అకౌంట్ ఓపెన్ చేసినా దానిని మ్యూల్ ఖాతాగా పిలుస్తారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఈ మ్యూల్ అకౌంట్లను మోసాలకు ఉపయోగిస్తున్నారు. ఇతరుల నుంచి కొట్టేసిన డబ్బులతో లావాదేవీలు చేసేందుకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇందుకోసం సామాన్య ప్రజలకు డబ్బులు ఆఫర్ చేసి వారి అకౌంట్లను తీసుకుంటారు. కొంతమంది డబ్బుల కోసం తమ అకౌంట్లను ఇలాంటివారికి ఉపయోగించుకోవడానికి అందిస్తున్నారు. అలాగే ప్రజల నుంచి డాక్యుమెంట్స్ సంపాదించి వారి పేరుతో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్.
తెలిసిన వ్యక్తులు లేదా తెలియని వ్యక్తులు మీ అకౌంట్ అడిగితే ఇవ్వకండి. డబ్బులు విత్ డ్రా చేసుకుంటామని అడిగినా అసలు ఇవ్వొద్దు. అలాగే మీ అకౌంట్లో మీకు తెలియకుండా డబ్బులు డిపాజిట్ అయినా లేదా విత్ డ్రా అయినా వెంటనే బ్యాంక్‌ను సంప్రదించండి. అలాగే వెంటనే పోలీసులను సంప్రదించండి. అలాగే ప్రతీ నెలా మీ సిబిల్ రిపోర్ట్ చెక్ చేసుకుంటే మీ పేరుపై ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. మీకు సంబంధం లేకుండా మీ పేరుపై అకౌంట్ కనిపిస్తే బ్యాంకు సిబ్బందిన సంప్రదించండి. అలాగే సంచార్ సౌథీ యాప్‌లోకి వెళ్లి మీ పేరుపై ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోండి. మీకు సంబంధం లేని నెంబర్లు ఉంటే వెంటనే యాప్‌లో ఫిర్యాదు చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు మ్యూల్ అకౌంట్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే సైబర్ క్రిమినల్స్ పాల్పడిన నేరానికి మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.