SBI: ఖాతాదారుడికి ఎస్బీఐ క్షమాపణలు.. అంతలోనే వార్నింగ్.. అసలు స్టోరీ ఏంటంటే..

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఓ బ్రాంచ్ కు పనిమీద వెళ్లిన ఖాతాదారుడికి వింత అనుభవం ఎదురైంది. అతడు అర్జెంట్ పనిమీద బ్రాంచ్ వెళ్లగా, ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది ఎవ్వరూ తమ సీట్లలో లేరు. మధ్యాహ్నం సమయం కావడంతో భోజనం చేస్తున్నారు. దీంతో ఆ ఖాతాదారుడు అసహనానికి గురయ్యాడు. బ్యాంకులో ఖాళీగా ఉన్న ఉద్యోగుల సీట్లను ఫొటో తీసి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

SBI: ఖాతాదారుడికి ఎస్బీఐ క్షమాపణలు.. అంతలోనే వార్నింగ్.. అసలు స్టోరీ ఏంటంటే..
Sbi

Updated on: Jun 02, 2024 | 6:55 PM

బ్యాంకులతో మనకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. జీవితాంతం ప్రతి విషయంలో వాటిలో లావాదేవీలు కొనసాగిస్తూ ఉంటాం. మన ఆర్థిక భద్రతకు, భవిష్యత్తు అవసరాలకు బ్యాంకు ఖాతాలలో డబ్బును పొదుపు చేస్తాం. చదువుకునే సమయంలో స్కాలర్ షిప్‌ల కోసం ప్రారంభించిన ఖాతా మనకు ఉద్యోగం వచ్చిన జీతం పడడానికి ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఫిక్స్ డ్ డిపాజిట్లను వీటిలోనే జమ చేస్తాం.

ప్రభుత్వ బ్యాంకులకు ఆదరణ..

దేశంలోనే అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. తమ నిబంధనలకు అనుగుణంగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. వాటిలోనే ఎక్కువ మంది తమ ఖాతాలను ప్రారంభిస్తారు. నేటి బిజీ జీవితంతో ప్రతి ఒక్కరూ సమయంతో పరుగులు పెడుతున్నారు. ఏ పని అయినా తొందరంగా అవ్వాలని కోరుకుంటున్నారు. బ్యాంకు వ్యవహారాలలోనూ అదే ఆశిస్తున్నారు.

ఫొటో స్టోరీ ఏమిటి..

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఓ బ్రాంచ్ కు పనిమీద వెళ్లిన ఖాతాదారుడికి వింత అనుభవం ఎదురైంది. అతడు అర్జెంట్ పనిమీద బ్రాంచ్ వెళ్లగా, ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది ఎవ్వరూ తమ సీట్లలో లేరు. మధ్యాహ్నం సమయం కావడంతో భోజనం చేస్తున్నారు. దీంతో ఆ ఖాతాదారుడు అసహనానికి గురయ్యాడు. బ్యాంకులో ఖాళీగా ఉన్న ఉద్యోగుల సీట్లను ఫొటో తీసి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అతడికి కలిగిన అసౌకర్యానికి ఎస్‌బీఐ క్షమాపణ చెప్పింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తీసిన ఆ ఫొటోలను తొలగించాలని ఆదేశించింది. ఆ ఫోటో, దానికి వెనుక జరిగిన కథ గురించి తెలుసుకుందాం.

వైరల్ అయిన ఫొటో..

రాజస్థాన్ కు చెందిన లలిత్ సోలంకి ఒక చార్టెర్ట్ అకౌంటెంట్. అతడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ కు వెళ్లాడు. అర్జెంట్ లావాదేవీపై బ్యాంకుకు వెళ్లగా అక్కడ కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. సిబ్బంది అంతా వేరే రూమ్ లో భోజనం చేస్తున్నారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగుల కుర్చీలను సోలంకి ఫొటో తీసి, సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ‘ఇప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు. బ్యాంకు సిబ్బంది అంతా ఒకేసారి భోజనం చేస్తున్నారు. ప్రపంచం అంతా మారినా వీరి సేవలు మాత్రం మారవు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానం చేశాడు. ఆ పోస్ట్ వైరల్ గా మారింది. దాదాపు 3 లక్షల మంది దాన్ని వీక్షించారు.

స్పందించిన ఎస్బీఐ..

లలిత్ సోలంకి ఫిర్యాదుపై ఎస్ బీఐ వెంటనే స్పందించింది. అతడికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. అలాగే అతడు పోస్ట్ చేసిన ఫొటోను వెంటనే తొలగించాలని కోరింది. భద్రతా కారణాల నేపథ్యంలో బ్యాంకు ఆవరణలో ఫొటోగ్రఫీని నిషేధించినట్టు తెలిపింది. ఆ ఫొటో దుర్వినియోగం అయితే మీరే జవాబుదారీగా ఉండవచ్చని సోలంకిని హెచ్చరించింది.

సోషల్ మీడియాలో చర్చ..

ఈ సంఘటనపై సామాజిక మాధ్యమంపై చర్చ జరిగింది. బ్యాంక్ సిబ్బంది భోజన వేళలపై అనేక మంది ఆరా తీశారు. వాటికి ఎస్ బీఐ సమాధానం చెప్పింది. తమ శాఖలలోని సిబ్బంది భోజనానికి నిర్దిష్ట సమయాలు లేవని వివరించింది. ఖాతాదారులకు నిరంతరం సేవలు అందించేందుకు ఆ సమయాలు అస్థిరంగా ఉంటాయని వివరించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..