దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వంట నూనెలపై (Edible Oil) అమలు చేస్తున్న రాయితీ కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2023 మార్చి 31 వరకు ఈ విధానం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. తద్వారా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా ధరలు నియంత్రణలో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పామాయిల్, సోయా ఆయిల్, పొద్దు తిరుగుడు నూనెపై ప్రస్తుతం కొనసాగుతున్న సుంకాలే రాబోయే ఆరు నెలల పాటు కొనసాగుతాయని తెలిపింది. అయితే ప్రస్తుతానికి వీటిపై సుంకాలు లేవు. కానీ 5 శాతం అగ్రి సెస్, వెల్ఫేర్ సెస్ కలుపుకుని 5.5 శాతం పన్ను అదనంగా పడుతోంది. పామాయిల్‌పై 13.75 శాతం, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్‌పై 19.25 శాతం రాయితీ సుంకం అమల్లో ఉంది. వంట నూనె విషయంలో మోసాలకు పాల్పడుతున్న కంపెనీల దృష్ట్యా కేంద్రం పలు చర్యలు తీసుకున్న విషయ తెలిసిందే.
వారం రోజుల క్రితం పామోలిన్ ఆయిల్ ధర లీటరుకు రూ.10-12 తగ్గింది. ప్రస్తుతం కిలో పామోలిన్ ధర రూ.114.50గా ఉంది. ఆ తర్వాత కిలో ధర రూ.101-102గా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైల్ వ్యాపారులు మాత్రం దాదాపు రూ. 50 ఎక్కువగా విక్రయిస్తున్నారు. అయితే ఈ MRP వాస్తవ ధర కంటే రూ. 10-15 మించకూడదు. వినియోగదారులకు సరఫరా చేసే రిఫైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని మినహాయించడం ధరలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆవాలు, వేరుశెనగ, నువ్వుల నూనెపై జీఎస్‌టీ అమలవుతుండగా పత్తి గింజల కేక్‌పై జీఎస్టీ లేదు. దీంతో పత్తి నూనెను ఉపయోగించి పలువురు మోసాలకు పాల్పడుతున్నారు.
కరోనా కారణంగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డబుల్ సెంచరీని దాటిపోయాయి. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరకులు, వంట నూనె ధరలు ఆకాశాన్నంటంతో ఆర్థికంగా కష్టాలు పడ్డారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎడిబుల్ ఆయిల్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..