ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో సెమీ కండక్టర్ మార్కెట్ రూ.52 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఈ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి 103.4 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం ఆరేళ్లలోనే రెట్టింపు ప్రగతి సాధిస్తుందని లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే ఇది వందశాతం నిజమేనని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. ప్రజలకు అవసరమైన అనేక వస్తువులు మార్కెట్ లోకి వస్తున్నాయి. వాటిలో ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా ముఖ్యమైనది. వీటి తయారీలో సెమీ కండక్టర్లను వినియోగిస్తారు. మన ఇంటిలో వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోనూ ఇవి తప్పనిసరిగా ఉంటాయి.
సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి అనేక కీలక రంగాలను వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇక్కడ తయారు చేసిన చిప్ లను అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో వాడతారు. మొబైల్ హ్యాండ్ సెట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలి కమ్యూనికేషన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలలో వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఐటీ, పారిశ్రామిక అప్లికేషన్ల ద్వారా సెమీ కండక్టర్ పరిశ్రమకు దాదాపు 70 శాతం ఆదాయం వస్తోంది.
ఐఈఎస్ఏ అధ్యక్షుడు అశోక్ చందక్ మాట్లాడుతూ ఫ్యాబ్ లు, ఓఎస్ఏటీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పెరిగిన ఆర్ అండ్ డీ పెట్టుబడులు, సహకార పరిశ్రమల చొరవతో భారత సెమీ కండక్టర్ పరిశ్రమ ప్రగతి పథంలో పరుగులు తీస్తోందన్నారు. ఐఈఎస్ఏ చైర్మన్ వి.వీరప్పన్ మాట్లాడుతూ ఈ పరిశ్రమ మార్కెట్ 2030 నాటికి 13 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు) కు చేరుకుంటుందన్నారు. మనం వినియోగించే అనేక వస్తువులలో సెమీ కండక్టర్లు కీలకంగా ఉంటాయి. త్రీడీ ప్రింటింగ్ మెషీన్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల నుంచి ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లలోని ఉష్ణోగ్రతల సెన్సార్లు, బ్యాంకు ఏటీఎంలు, కంప్యూటర్, కాలిక్యులేటర్, సోాలార్ ప్లేట్లు.. ఇలా అనేక వాటిలో వీటి అవసరం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి