Indian Railways: ఆ రైల్వే కంపెనీల విలీనం గురించి తెలుగు ఎంపీ ప్రశ్న… రైల్వే మంత్రి సమాధానం ఏంటంటే?

|

Mar 17, 2025 | 6:30 PM

భారత రైల్వేలతో అనుసంధానంగా ఉండే నాలుగు ప్రధాన పీఎస్‌యూ కంపెనీల విలీనం గురించి ఇటీవల పార్లమెంటులో ఓ తెలుగు ఎంపీ ప్రశ్న అడిగారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్ఎల్), ఐఆర్‌సీఓఎన్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఆర్‌సీఐఎల్), ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ)లను ఒకే కంపెనీగా విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందా? అని ఏలూరు లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అడిగారు. ఈ ప్రశ్న తర్వాత రైల్వే పీఎస్‌యూల భవితవ్యం గురించి కొత్త చర్చ మొదలైంది.

Indian Railways: ఆ రైల్వే కంపెనీల విలీనం గురించి తెలుగు ఎంపీ ప్రశ్న… రైల్వే మంత్రి సమాధానం ఏంటంటే?
Indian Railway
Follow us on

ఆర్‌వీఎన్ఎల్, ఐఆర్‌సీఓఎన్, రైల్‌టెల్, ఐఆర్‌సీటీసీ అన్నీ రైల్వే మంత్రిత్వ శాఖ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేశారు. ఈ విలీనం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యం, ​​పరిపాలనా నిర్మాణం, ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అని ఎంపీ మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ సంస్కరణ రైల్వేలు ఎదుర్కొంటున్న అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం, పరిపాలనా అసమర్థత వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుందా? అని ప్రశ్న లేవనెత్తారు. ఈ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ పీఎస్‌యూ కంపెనీలను విలీనం చేయాలనే నిర్ణయం వాటి పరస్పర సినర్జీ, మార్కెట్ స్థానం, మూలధనీకరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం ఆర్‌వీఎన్ఎల్, ఐఆర్‌సీఓఎన్, రైల్‌టెల్, ఐఆర్‌సీటీసీ  కంపెనీల విలీనం కోసం ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. విలీనాలు వంటి విషయాలకు బాధ్యత ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్టుబడి, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగంపై ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎలాంటి విలీన ప్రణాళికలను తిరస్కరించినప్పటికీ, భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలను ఆర్థికంగా బలమైన శక్తిగా మార్చడానికి ఈ తరహా చర్యలను తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

గతంలో ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీని వల్ల బ్యాంకింగ్ రంగంలో మెరుగుదల కనిపించింది . ఈ రైల్వే సంబంధిత కంపెనీల పెట్టుబడిదారులు, ఉద్యోగులు ప్రస్తుతం ఎటువంటి మార్పు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు కానీ భవిష్యత్తులో ఏదైనా విలీనం జరిగితే అది రైల్వే సంబంధిత సేవలలో మెరుగుదలతో పాటు పరిపాలనా ఖర్చులను తగ్గించడానికి దోహదం చేస్తుందని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి