
ఇండియాలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థలలో ఒకటైన TCS ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల వ్యాపారానికి ముప్పు లేదని స్పష్టం చేసింది. కంపెనీ CEO కృతివాసన్ ప్రకారం.. AI వల్ల ఆదాయం తగ్గిపోతుందనే భయం కంపెనీకి లేదని, దీనిని అవకాశంగా చూస్తున్నామని తెలిపారు. ముంబైలో జరిగిన NASSCOM టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరంలో మాట్లాడిన కృతివాసన్, ఉద్యోగులు AI సాధనాలను ధైర్యంగా ఉపయోగించాలని సంస్థ ప్రోత్సహిస్తోందన్నారు. AI సహాయంతో పని వేగంగా, మెరుగ్గా, తక్కువ ఖర్చుతో చేయగలిగితే, అది తాత్కాలికంగా ఆదాయంపై ప్రభావం చూపినా, కస్టమర్లకు ఆ పరిష్కారాలను చెప్పాలని మేము మా సహచరులకు సూచిస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
AI తమ జీవనోపాధిని దెబ్బతీయదని, దీనివల్ల మరిన్ని అవకాశాలు తెరుచుకుంటాయని TCS నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. మార్పును అడ్డుకోవడం కంటే, దానిని స్వీకరించి ప్రయోజనం పొందడమే సంస్థ వ్యూహమని కృతివాసన్ వివరించారు. కంపెనీ దృష్టిలో AI అనేది ఖర్చు తగ్గింపు సాధనం మాత్రమే కాదు, భవిష్యత్ వృద్ధికి కీలక ఇంధనమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో Nifty IT Index దాదాపు 21 శాతం పడిపోవడంతో భారత ఐటీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దాదాపు 23 ఏళ్లలో ఇదే అత్యంత చెత్త నెలవారీ ప్రదర్శనగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ, AI ఆధారిత డెలివరీ మోడల్ దీర్ఘకాలంలో సంస్థలకు పోటీ ప్రయోజనం ఇస్తుందని TCS నమ్మకం వ్యక్తం చేస్తోంది.
మొత్తానికి AI కారణంగా ఉద్యోగాలు లేదా ఆదాయం తగ్గుతాయనే భయాన్ని TCS ఖండిస్తూ, అదే సాంకేతికతను వినియోగించి వేగం, సామర్థ్యం, ఖర్చు పరంగా ముందంజలో నిలవాలని వ్యూహం అమలు చేస్తోంది. పరిశ్రమలో జరుగుతున్న వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా సంస్థ తన వ్యాపార నమూనాను మలుచుకుంటున్న సంకేతాలుగా నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి