
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన బడ్జెట్ 2023లో ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. కొత్త ఆదాయపు పన్ను విధానం వారికి కొంత వెసులుబాటును ఇవ్వడంతో పాటు కొనుగోళ్లు శక్తిని పెంచుతుందడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపునిస్తోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల కొనుగోలు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కూడా పెరిగే చాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రకటించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. అందులో బ్యాటరీల దిగుమతిపై సుంకం రాయితీని మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం రూ. 3 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 7 లక్షలు వార్షిక ఆదాయం దాటిన వారు మాత్రమే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రూ. ఏడు లక్షలు దాటిన వారి స్లాబ్ ఇలా ఉంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రగతిశీలమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఆటోమొబైల్ రంగ వృద్ధికి, పొదుపుపై ప్రోత్సాహాన్ని అందించే దృష్టితో ఉందని చెబుతున్నారు. గ్రీన్ హైడ్రోజన్, ఇతర ఇంధన రంగాలపై మంత్రి చేసిన ప్రకటనల ద్వారా చేపట్టనున్న చర్యలు 2070 నాటికి ప్రభుత్వ లక్ష్యమైన కార్బన్ న్యూట్రాలిటీని సాధించడానికి ఉపకరిస్తాయని చెబుతున్నారు. అలాగే ఈ బడ్జెట్ తో సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మూలధన వ్యయం, వ్యవసాయ-క్రెడిట్, ఇన్‌ఫ్రా-డెవలప్‌మెంట్ క్రెడిట్ , తక్కువ పన్ను స్లాబ్‌ల కారణంగా వినియోగదారుల చేతుల్లో అధిక ఆదాయం ఉండటానికి దోహదం చేస్తుందని.. ఇది ఆటో రంగం వృద్ధికి దారితీస్తుందని వివరిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం లిథియం సెల్స్, మోటారులకు శాశ్వత అయస్కాంతాలు, సెమీకండక్టర్లు మొదలైనవి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల రేటును పెంచుతాయి. అవి అదుపులో ఉండాలంటే కస్టమ్స్ హేతుబద్ధీకరణ జరగాలి. దిగుమతి సుంకం తక్కువగా ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం-అయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే యంత్రాలకు కస్టమ్స్ డ్యూటీ రాయితీని కొనసాగించడం కొంత సానుకూలంగా ఉంటుందని వివరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..