పెళ్లిళ్ల సీసన్ కావడంతో సుజుకీ మోటార్ సైకిల్ విక్రయాలు నవంబర్ మాసంలో జోరందుకున్నాయి. 2024 నవంబర్ మాసంలో 94,370 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2023 నవంబర్ మాసం (87,096 యూనిట్ల విక్రయాలు)తో పోల్చితే 2024 నవంబర్ మాసంలో సుజుకీ మోటార్ సైకిళ్ల విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదయ్యింది. ఆ మేరకు జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇందులో గత నెల నవంబర్‌లో దేశీయ వాహన విక్రయాలు 78,333 యూనిట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో జరిగిన 73,135 యూనిట్ల విక్రయాలతో పోల్చితే 7 శాతం వృద్ధి నమోదయ్యింది.
నవంబర్‌లో పెరిగిన ఎగుమతులు..
అలాగే నవంబర్ మాసంలో 16,037 యూనిట్ల సుజుకీ మోటార్ సైకిళ్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. 2023 నవంబర్ మాసంలో 13,961 యూనిట్లు ఎగుమతితో పోలిస్తే.. ఈ ఏడాది నవంబరు మాసంలో ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి నమోదయ్యింది.
పెళ్లిళ్ల సీజన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న గిరాకీ కారణంగా మోటార్ సైకిళ్ల విక్రయాలు నవంబర్ మాసంలో వృద్ధిని నమోదు చేసుకున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.
మోటార్ సైకిళ్ల విక్రయాలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనడానికి సంకేతమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిసెంబర్‌లోనూ విక్రయాల జోరు కొనసాగే అవకాశముందని అంచనావేస్తున్నారు.