Sugar Exports: చక్కెర ఎగుమతులకు అనుమతించాలంటున్న మిల్లర్లు.. ఆహార కార్యదర్శికి లేఖ.. వేరే ఆప్షన్ లేదంటూ..

Sugar Exports: భారత్ ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో చక్కెరను ఎగుమతి చేసింది. అయితే ప్రస్తుతం మిల్లర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎగుమతులు పెంచాలని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Sugar Exports: చక్కెర ఎగుమతులకు అనుమతించాలంటున్న మిల్లర్లు.. ఆహార కార్యదర్శికి లేఖ.. వేరే ఆప్షన్ లేదంటూ..
Sugar

Updated on: Jun 12, 2022 | 9:29 AM

Sugar Exports: భారత్ ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో చక్కెరను ఎగుమతి చేసింది. అయితే ప్రస్తుతం మిల్లర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎగుమతులు పెంచాలని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మిల్లులు అదనంగా మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసేందుకు అనుమతించాలని ఆహార కార్యదర్శిని కోరింది. ఈ సీజన్‌లో (అక్టోబర్ 2021-సెప్టెంబర్ 2022) ముడి చక్కెరకు ఎగుమతి మాత్రమే ఉత్తమ ఎంపిక. ISMA ప్రెసిడెంట్ ఆదిత్య జున్‌జున్‌వాలా శుక్రవారం ఆహార కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు. నిర్ణీత ఒప్పందాల ప్రకారం చక్కెర ఎగుమతి కోసం ఆర్డర్ జారీ అయింది. కానీ ఇప్పటికీ పెద్ద మొత్తంలో ముడి చక్కెర మిల్లుల వద్ద ఉంది.

ఎగుమతే ఏకైక ఆప్షన్:

ఇప్పటికే ముడి చక్కెరను ఉత్పత్తి చేసిన మిల్లులు ఎగుమతి చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందంటున్నాయి. వారు ముడి చక్కెరను తెల్లగా మార్చలేరు.. ఎందుకంటే క్రషింగ్ సీజన్ ముగిసింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్‌లో కూడా అమ్మడం కుదరదు. ఈ పరిస్థితిలో ముడి చక్కెరకు ఎగుమతి మాత్రమే ఏకైక ఎంపిక. ఇటీవల.. ISMA తన కమిటీ సమావేశంలో చక్కెర ఉత్పత్తిని 350 లక్షల టన్నుల నుంచి 360 లక్షల టన్నులకు అంచనా వేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చెరకు లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల చక్కెర ఉత్పత్తి పెరుగుతుందని అంచనాలు చెబుతున్నాయి.

పంచదార ధరల్లో పెంపుదల ఉండదు:

పెరిగిన చక్కెర ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని.. ఈ సీజన్‌లో మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించాలని ఆదిత్య జున్‌జున్‌వాలా కోరుతున్నారు. మే నెలాఖరు వరకు రికార్డు స్థాయిలో 86 లక్షల టన్నుల ఎగుమతులు జరిగినప్పటికీ.. దేశంలో చక్కెర ధరలు పెద్దగా పెరగలేదని ISMA తెలిపింది. పంచదార ధర కిలోకు రూ.33 నుంచి రూ.34 ఉండగా.. ఇప్పటికీ ఖర్చు కంటే తక్కువకే అందుబాటులో ఉంది. 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి దేశీయ చక్కెర స్థితిని ఏ విధంగానూ ప్రభావితం చేయదని ఆయన అంటున్నారు. అక్టోబర్ 1, 2022 నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్‌లో కనీసం రెండున్నర నెలల పాటు దేశ అవసరాలను తీర్చేందుకు సరిపడా చక్కెర లభ్యత ఉంటుందని తెలిపారు.

ఎగుమతుల్లో భారత్‌దే రికార్డు: 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అక్టోబర్-సెప్టెంబర్ మధ్య కాలంలో సుమారు 9 మిలియన్ టన్నుల ఎగుమతి కోసం ఒప్పందాలు కుదిరాయి. చక్కెర మిల్లుల నుంచి దాదాపు 86 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కావడం ఒక రికార్డు. 2020-21 సంవత్సరంలో చక్కెర ఎగుమతులు 70 లక్షల టన్నులు, 2019-20లో 59.6 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చక్కెర ఉత్పత్తిలో భారత్ అతిపెద్ద ఉత్పత్తిదారు, రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. గత సీజన్‌లో దేశ వ్యాప్తంగా 506 మిల్లుల్లో చెరకు క్రషింగ్‌ జరిగింది. ఈ సీజన్ 2021-22లో ఈ మొత్తం సంఖ్య 522 మిల్లులకు చేరుకున్నాయి.