Stock Markets: వారాంతంలో స్టాక్ మార్కెట్లో బలమైన కొనుగోళ్ళు జరగడంతో లాభాల్లో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు చాలాకాలం తరువాత లాభాల బట పట్టాయి ఈ వారంలో. రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు అత్యధికంగా 6 శాతం లాభాలను నమోదు చేశాయి. ఇక సన్ ఫార్మా షేర్లు 4.25 శాతం బలహీనపడ్డాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 308 పాయింట్లు (0.60%) లాభంతో 51,423 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్లు (0.64%) లాభంతో 15,436 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటానికి కారణమైంది. అమెరికాలో కరోనా సంక్షోభం నుండి బయటపడేందుకు జోబిడెన్ ప్రభుత్వం భారీ ఉద్దీపన పథకాలను ప్రవేశపెడుతుండడం అగ్రరాజ్యం సూచీలతో పాటు ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. వీటికి తోడు కీలక రంగాలు రాణించడంతో స్టాక్ మార్కెట్ సానుకూల ధోరణిలో ఈ వారం ట్రేడింగ్ ముగించింది.
నిఫ్టీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 15,469 పాయింట్లకు చేరుకుంది. ఈ రోజు, నిఫ్టీ అధిక స్థాయిలో అమ్మడం వల్ల 15,400 పాయింట్ల వద్ద మద్దతు పొందింది. ఇంధన, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మరియు మెటల్ స్టాక్స్‌లో కొనుగోలు చేయడం ద్వారా స్టాక్ మార్కెట్‌కు మద్దతు లభించింది. నిపుణుల లెక్కల ప్రకారం రియాల్టీ, స్టీల్, ఎనర్జీ, బ్యాంకింగ్ వంటి అధిక బీటా స్టాక్స్ ఈరోజు మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి. వారి అంచనా ప్రకారం మిడ్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్లలో కొనుగోలు చేయడం, కోవిడ్ సంక్రమణ యొక్క కొత్త కేసులలో పోకడలు క్షీణించడం, నివారణ మరియు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం ద్వారా మార్కెట్ ఈ వారం వృద్ధి చెందింది.
ఇక బీఎస్ఈ రికార్డు స్థాయిలో పెరుగుదలతో మార్కెట్ ఉదయం ప్రారంభమైంది. ఇండెక్స్ నిన్నటి ముగింపు స్థాయి కంటే 83.35 పాయింట్లు అధికంగా 15,421 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో ఇది 15,455 పాయింట్లకు చేరుకుంది, ఇది ఇప్పటివరకు అత్యధిక స్థాయి. చివరకు 51,423 పాయింట్ల వద్ద వారాన్ని ముగించింది.
వచ్చే వారం మార్కెట్ బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫార్మా స్టాక్స్‌పై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ముత్తూట్ ఫైనాన్స్, ధనలక్ష్మి బ్యాంక్, డివిస్ ల్యాబ్, అరబిందో ఫార్మా నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ రంగ వాటాలు వచ్చే వారం మరింత దూకుడుగా ఉండొచ్చని వారి అంచనా.