ఓర్నాయనో.! స్టాక్ మార్కెట్‌లో మళ్లీ బ్లడ్ బాత్.. ఒక్కరోజులో రూ.8 లక్షల కోట్లు హుష్‌కాకి

|

Jan 27, 2025 | 8:54 PM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బలహీన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు.. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు.. ట్రంప్ టారిఫ్‌ల భయాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఒక్క రోజే లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ఆ వివరాలు

ఓర్నాయనో.! స్టాక్ మార్కెట్‌లో మళ్లీ బ్లడ్ బాత్.. ఒక్కరోజులో రూ.8 లక్షల కోట్లు హుష్‌కాకి
Follow us on

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. కొలంబియా – అమెరికా మధ్య ఉద్రిక్తతలు సూచీలను నిలువునా ముంచేస్తున్నాయి. ఆ ప్రభావం భారతీయ స్టాక్‌మార్కెట్లపై తీవ్రంగా కనిపిస్తోంది. ప్రధానంగా స్మాల్‌, మిడ్ క్యాప్‌ ఇండెక్స్‌లు భారీగా పతనమవుతున్నాయి. దీంతో ఇవాళ ఒక్కరోజే దేశీయ సూచీలు 8లక్షల కోట్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టి మళ్లీ 22, 900వేల దిగువకి పడిపోయింది. గత శుక్రవారం ముగింపు 76, 190తో పోల్చుకుంటే ఇవాళ ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్‌ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత తీవ్రమయ్యాయి.

ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఆయన ట్రెడ్ పాలసీలపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. అమెరికాలోని అక్రమ వలసదారులను తిప్పి పంపే విషయంలో ముందుగా కొలంబియా వ్యతిరేకించడం.. దానికి ప్రతిగా 25శాతం సుంకం విధిస్తామని ట్రంప్ బెదిరించడం.. ఆ తర్వాత కొలంబియా తన నిర్ణయం మార్చుకోవడం చకచకా జరిగిపోయాయి. దేశాలను దారికి తెచ్చుకునే విషయంలో ట్రంప్‌ బెదిరింపులకి దిగుతుండడంతో ఏ దేశంపై ఎలా వ్యవహరిస్తారోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇక త్రైమాసిక ఫలితాల సీజన్‌లో వెలువడుతున్న కార్పొరేట్ ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశగా ఉన్నారు. దీనికి తోడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కూడా ఇన్వెస్టర్లకు పెద్దగా ఆశలు లేకపోవడం మార్కెట్లలో నిరాసక్తత కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌ నాటికి 64వేల కోట్ల ఈక్విటీలను విక్రయించారు. భవిష్యత్తులో ఈ మొత్తాలు తగ్గుతాయని గానీ.. మళ్లీ కొనుగోళ్లకు దిగుతారన్న అంచనాలు లేకపోవడమే మార్కెట్‌లో ఈ పరిస్థితి కారణమంటున్నారు మార్కెట్ అనలిస్ట్‌లు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి