Stock Market Crash: డొనాల్డ్ ట్రంప్ ఒక్క వార్నింగ్‌తో కుప్పకూలిన భారత మార్కెట్లు! అసలు ఏం జరిగిందంటే?

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో గురువారం ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరం ఉత్సాహంగా ప్రారంభమవుతుందని భావించిన ఇన్వెస్టర్లకు మార్కెట్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైపోవడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Stock Market Crash: డొనాల్డ్ ట్రంప్ ఒక్క వార్నింగ్‌తో  కుప్పకూలిన భారత మార్కెట్లు! అసలు ఏం జరిగిందంటే?
Stock Market Crash Today

Updated on: Apr 02, 2026 | 2:31 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేసిన దూకుడు వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను వణికించాయి. ఈ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలపై తీవ్రంగా పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన గిఫ్ట్ నిఫ్టీ ఒక్కసారిగా 300 పాయింట్లకు పైగా పడిపోవడం ఇన్వెస్టర్లలో భయాందోళనలను పెంచింది. అసలు మార్కెట్ ఎందుకు పడిపోయింది? క్రూడాయిల్ ధరలు ఎలా మారుతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికతో మారిన సీన్.. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తూ చేసిన ప్రకటన మార్కెట్లను కుదిపేసింది. “ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి, అవసరమైతే ఇంధన రంగాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటాం” అని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఆసియా మార్కెట్లు తమ గరిష్ట స్థాయిల నుండి ఒక్కసారిగా పడిపోయాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

సెగ పెడుతున్న ముడి చమురు ధరలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు అకస్మాత్తుగా 4 శాతానికి పైగా పెరిగాయి. గతంలో 100 డాలర్ల లోపు ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పుడు బ్యారెల్‌కు 106 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధరలు పెరగడం భారతదేశం వంటి దిగుమతి చేసుకునే దేశాలకు పెద్ద దెబ్బ. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరిగింది. డాలర్ సూచీ 100 మార్కుకు సమీపంలో ఉండటం భారత కరెన్సీకి ఆందోళన కలిగించే అంశం.

ఆటో రంగం నుంచి సానుకూల సంకేతాలు

మార్కెట్ ఇంత అస్థిరంగా ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ రంగం మాత్రం కొంత ఆశాజనకమైన పనితీరును కనబరిచింది. మార్చి నెల సేల్స్ డేటాలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 9 శాతం పెరిగి 6 లక్షల యూనిట్లకు చేరగా, ఎగుమతులు ఏకంగా 15 శాతం వృద్ధి చెందాయి. అలాగే టీవీఎస్ మోటార్స్ 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, మార్కెట్ మొత్తం పతనంలో ఈ సానుకూలత కొట్టుకుపోయింది.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ప్రస్తుత పరిస్థితులపై జియోజిత్ ఇన్వెస్టమెంట్స్ నిపుణుడు వినోద్ నాయర్ స్పందిస్తూ.. మార్కెట్ అనిశ్చితిగా ఉందని హెచ్చరించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల మార్కెట్ ఎప్పుడైనా దిశ మార్చుకోవచ్చు. ఈ సమయంలో అనవసరమైన రిస్క్ తీసుకోవద్దని, ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తూ తదుపరి అడుగులు వేయాలని సూచించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కదలికలు ఉన్నప్పటికీ, భారీ పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. స్టాక్ మార్కెట్ మరియు ఆర్థిక పరమైన విషయాలలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించాలి.

Follow Us