
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంక్ వివిధ కాలాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ పెరుగుదల ఉంది. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ రేట్లు అక్టోబర్ 15, 2022 నుండి అమలులోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. రెండు నెలల విరామం తర్వాత రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్ల నుండి 20 బేసిస్ పాయింట్ల మధ్య పెరుగుతాయి.
ఎస్‌బీఐలో 46 రోజుల నుండి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇప్పుడు 4 శాతం చొప్పున అందుబాటులో ఉంటాయి. ఇంతకు ముందు ఈ కాలానికి వడ్డీ రేటు 3.90 శాతం. వడ్డీ రేట్లలో మార్పు తరువాత, 180 రోజుల నుండి 210 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.55 శాతం నుండి 4.65 శాతానికి పెరిగింది. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటును 211 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువగా ఉన్న డిపాజిట్లపై 4.60 శాతం నుంచి 4.70 శాతానికి పెంచింది. ఎస్‌బీఐ రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్ ఖాతాలపై ఒక సంవత్సరం నుండి రెండేళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు ఇప్పుడు 5.45 శాతం నుండి 5.60 శాతానికి పెరిగింది.
రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు తక్కువ కాల వ్యవధి గల ఎఫ్‌డీలపై, వడ్డీ రేటు 5.50 శాతం నుండి 5.65 శాతానికి పెరిగింది. అదే సమయంలో మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 5.60 శాతం నుంచి 5.80 శాతానికి పెరిగింది. కాగా, ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 5.65 శాతం నుంచి 5.85 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్ల కోసం 7 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు 3.5 శాతం వడ్డీని ఆకర్షిస్తుంది. ఇంతకుముందు ఈ కాలానికి వడ్డీ రేటు 3.40 శాతం. అదే సమయంలో 46 రోజుల నుంచి 179 రోజుల మధ్య కాలపరిమితి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటు 4.40 శాతం నుంచి 4.50 శాతానికి పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి