
స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్. వీటి ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇటీవల కొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ ధరలు మార్చి 1వ తేదీ నుంచి పెరగ్గా.. ఇప్పుడు అన్ని కంపెనీల ఫోన్ల ధరలు అధికమవుతున్నాయి. దీనికి అనేక కారణాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మెమొరీ చిప్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోన్నాయి. ఇది ఒక కారణం కాగా.. దీంతో పాటు డిర్యామ్, నంద్ స్టోరేజ్ ఖర్చులు కూడా ప్రియం అవుతున్నాయి. డాలర్‌తో పొలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకి పడిపోతుంది. దీని వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు హైక్ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల తయారీకి ఉపయోగించే సెమీ కండక్టర్లు, చిప్‌లు, ఇతర పరికరాలను విదేశాల నుంచి ఎక్కువగా భారత్ దిగుమతి చేసుకుంటుంది. డాలర్ బలపడటం వల్ల వాటికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.
సెమీ కండక్టర్ చిప్ సెట్స్ ధరలు ప్రతీ నెలలోనూ పెరుగుతున్నట్లు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. 512 జీబీ, 1 టీబీ మాడ్యూల్స్ ధరలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లలో వాడే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, స్టోరేజ్ మాడ్యూల్, నంద్ ఫ్లాష్‌కు కొరత ఏర్పడింది. ఏఐ డేటా సెంటర్లను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న క్రమంలో చిప్‌లు, మెమెరీ కార్డులను వాటికి తరలిస్తున్నారు. దీని వల్ల కొరత కారణంగా వాటి ధరలు గత ఏడాది నవంబర్ నుంచి ఏకంగా 50 శాతం మేర పెరిగాయి. దీని వల్ల స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువకావడంతో.. వీటి ధరలను పెంచుతున్నాయి.
ల్యాప్‌టాప్ ధరలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. ధరలు పెరుగుతుండటంతో అమ్మకాలు భారీగా పతనమవుతున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ల ధరలు 40 శాతం వరకు పెరిగాయి. ప్రముఖ కంపెనీలైన వివో, శామ్ సంగ్, రియల్ మీ, పోకో, ఓపో, వన్ ప్లస్, షియామీ, మోటరోలా కంపెనీలు ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. అయితే స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగడంతో సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు మొబైల్ రీటెయిల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య 35 శాతం కొత్త ఫోన్ల విక్రయాలు తగ్గాయి. డాలర్ మరింత బలపడి రూపాయి విలువ తగ్గితే ధరలు మరింత పెరగనున్నాయని తయారీ కంపెనీలు చెబుతున్నాయి. దీని వల్ల కొత్తగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేవారికి షాకే.