
కొన్నాళ్ల కిందటి వరకు బంగారంతో పోల్చుకుని వెండిని పెద్దగా పట్టించుకోలేదు కాని.. ఒక్కసారి దాని మార్కెట్ తీరు.. పెరుగుతున్న ధరను చూస్తే.. అయ్యో.. సిల్వర్ కొనకుండా పెద్ద తప్పు చేశామా! అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడంటే వెండి.. జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది కాని.. కొన్నాళ్ల కిందట ఈ పరిస్థితి లేదు. గత ఏడాదిలోనే దీని రేటు దాదాపు 70 శాతం పెరిగింది. ఇంకా చెప్పాలంటే గత నాలుగు నెలల్లోనే ఇంకా స్పీడందుకుంది. మదుపరుల్లో కూడా వెండిపై పెట్టుబడి పెట్టాలనే కోరిక పెరగడానికి కారణం.. దీని రేటే. ఇప్పుడు వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల కన్నా.. ఎక్కువమంది దీనిని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. అందుకే వెండి బార్లు, సిల్వర్ కి సంబంధించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి.
ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి సుమారు 90 వేల రూపాయిలు ఉంది. ఇప్పుడు.. అంటే అక్టోబర్ 14న కిలో వెండి హైదరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల రూపాయిలు దాటేసింది. చరిత్రలో తొలిసారిగా కేజీ వెండి ధర రెండు లక్షలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించింది. నిజానికి వెండి అంటే.. కొన్నాళ్ల కిందటి వరకు కంచాలు, దేవుడి విగ్రహాలు, దీపపు కుందులు, గిన్నెలు, పాత్రలు, ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్.. ఇలాంటి రూపంలోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలలో దీని వినియోగం పెరిగింది. అదే ఇంతటి డిమాండ్ కు కారణమైంది. లేకపోతే.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే.. కేజీ ధర వంద శాతానికి మించి పెరగడం అంటే మాటలా? దీనిని బట్టి వెండికి ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఇదే డిమాండ్ ను అంచనా వేసుకుని.. సిల్వర్ స్కీమ్స్ లో పెట్టుబడులు పడుతున్నారు. దీంతో వీటిని నిర్వహిస్తున్న కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల మీద ప్రెజర్ పెరిగింది. అందుకే ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాల్లో కొత్త ఇన్వెస్ట్ మెంట్స్ ను ఆపేశాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడుల విలువకు సమానంగా మార్కెట్లో ఫిజికల్ సిల్వర్ ను కొనడం వారికి సాధ్యం కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఏదైనా పండగ వచ్చిందంటే బంగారం, సిల్వర్.. రెండిట్లో ఏది కొంటారు అంటే.. మెజార్టీ వర్గం.. బంగారమే అని చెబుతుంది. కానీ ఇప్పుడు మాత్రం కొంతమంది సిల్వర్ అంటున్నారు. ఇక సామాన్య ప్రజలతో పాటు పరిశ్రమలు, సెంట్రల్ బ్యాంకులకు కూడా సిల్వర్ ఇప్పుడు ఫేవరెట్ మెటల్. వెండి ధగధగల ముందు బంగారంతో పాటు మిగిలిన లోహాలు కూడా వెలవెలబోతున్నాయి. పారిశ్రామికంగా డిమాండ్ పెరగడం, సప్లయ్ సరిపడా లేకపోవడం, ఇందులో పెట్టుబడులు పెడితే లాభం వస్తుంది అని నమ్మడం.. ఇవే దీని డిమాండ్ ను అమాంతం పెంచాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయంగా, భౌగోళిక అనిశ్చితి వల్ల వెండి ధర భారీగా పెరిగింది. అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాల్లో ఉన్న పరిస్థితులు కూడా కారణం అని చెప్పచ్చు. బ్రిటన్ లో అయితే కంటికి కనిపించే వెండి కొరత చాలా ఎక్కువగా ఉంది. వెండికి ఇంతగా డిమాండ్ పెరగడానికి చాలామంది అనుకున్నట్టు.. సిల్వర్ ఆర్నమెంట్స్ కు డిమాండ్ పెరగడమో, వెండిలో పెట్టుబడులు పెరగడమో కాదు. దీనికి అసలైన కొన్ని కారణాలను నేను మీకు చెబుతాను. అవి.. కొన్ని మోడ్రన్ టెక్నాలజీలు.. అంటే.. సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్ వేర్, 5G మౌలిక సదుపాయాలు. వీటిలో వెండి వినియోగం పెరిగింది. అది కూడా నిన్నటి మొన్నటిది కాదు.. నాలుగైదు ఏళ్లుగా పెరిగింది. అందుకే సిల్వర్ కు డిమాండ్ ఎక్కువైంది. కానీ సప్లయ్ మాత్రం డిమాండ్ కు తగ్గట్టు లేదు. బంగారంతో పోలిస్తే.. రీసైక్లింగ్ లెవల్స్ కూడా చాలా తక్కువ. ఇక కొత్త సిల్వర్ గనులు అందుబాటులోకి రావాలంటే 7 నుంచి 8 ఏళ్లు పడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఏఐ హార్డ్ వేర్, సోలార్, 5G.. వీటికి డిమాండ్ పెరిగింది. పైగా ఈ రంగాల్లో సిల్వర్ కు బదులు వేరే లోహాన్ని వినియోగించడానికి కూడా వీలు కాదు. అందుకే వెండి ధరలు ఇంత భారీగా పెరిగాయని నిపుణులు అంటున్నారు. వెండికి ఈ రంగాల్లో ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. అది కాస్తా.. ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ ఈటీఎఫ్ లకు డిమాండ్ ను పెంచేసింది.
అమెరికా, యూరప్, చైనా.. ఇలా ఎక్కడ చూసినా ఫిజికల్ సిల్వర్ సరఫరా చాలా తక్కువగా ఉంది. అందుకే ఫ్యూచర్ సిల్వర్ తో పోలిస్తే.. ఫిజికల్ సిల్వర్.. 3 డాలర్ల పీమియంతో ట్రేడవుతోంది. నిజం చెప్పాలంటే ఇది అసాధారణం. దీనిని బట్టి మార్కెట్ ఎంత టైట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనికి తోడు.. ఇప్పుడిది స్ట్రాటజిక్ మెటల్ గా మారిపోయింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయో తెలుసా? బంగారంతో పాటు సిల్వర్ ను ఫిజికల్, ఈటీఎఫ్ రూపంలో కొంటున్నాయి. ఈమధ్య అమెరికా.. వెండిని ఎలా వర్ణించిందో తెలుసా? క్రిటికల్ మినరల్ అని చెప్పింది. ఇలా ఎందుకు చెప్పిందంటే, వివిధ దేశాలు, కంపెనీలు.. వెండి సరఫరా విషయంలో చాలా జాగ్రత్తపడతున్నాయి. పైగా సెంట్రల్ బ్యాంకులు ఫిజికల్ సిల్వర్ రిజర్వ్ లను పెంచుకుంటున్నాయి. అందుకే ఇదిప్పుడు ఇండస్ట్రియల్, స్ట్రాటజిక్ మెటల్ గా మారిపోయింది. సో.. వెండి ధర ఇంత వేగంగా పెరగడానికి అసలైన కారణాలివి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..