
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ SEBI కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్లలోకి థర్డ్-పార్టీ చెల్లింపులను అనుమతించాలని సెబీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి విడుదల చేసిన సంప్రదింపు పత్రంపై జూన్ 10 వరకు ప్రజల అభిప్రాయాలను కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం చేసే చెల్లింపులు తప్పనిసరిగా పెట్టుబడిదారుడి సొంత బ్యాంకు ఖాతా నుంచే జరగాలి. అలాగే ఆర్‌బీఐ అనుమతి పొందిన పేమెంట్ అగ్రిగేటర్ లేదా సెబీ గుర్తింపు పొందిన క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి.
అయితే పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ విధానాన్ని సమీక్షించిన సెబీ, కొన్ని స్పష్టమైన, నియంత్రిత పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల్లో ముఖ్యంగా ఉద్యోగుల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు యజమానులు జీతం నుంచి కోత విధించి చెల్లింపులు చేయడం ఒకటి. ఉద్యోగులకు పొదుపు అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కంపెనీలు సమీకృతంగా ఈ చెల్లింపులు చేయవచ్చని సెబీ పేర్కొంది. దీనివల్ల ఉద్యోగుల్లో దీర్ఘకాలిక పెట్టుబడులపై అవగాహన పెరుగుతుందని భావిస్తోంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే కమీషన్‌ను నగదు రూపంలో కాకుండా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల రూపంలో ఇవ్వడానికి కూడా సెబీ అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది.
అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా ఈ యూనిట్లు కేటాయించబడతాయి. ఇక పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్ లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించాలని సెబీ ప్రతిపాదించింది. పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ, మనీ లాండరింగ్ నిరోధక నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులు ఉంటాయని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి